Sakshi News home page

సుస్థిరతకే ఓటు!

Published Fri, Nov 24 2023 4:26 AM

Greater voter views in Sakshi Roadshow

సాక్షి, హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌  : వచ్చే గురువారం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌  జరగనుంది. సరిగ్గా వారం రోజులుందనగా నగర ప్రజల పల్స్‌ పట్టుకునేందుకు ‘సాక్షి’ రోడ్‌ షో నిర్వహించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాన్ని ఎనిమిది కారిడార్లుగా వర్గీకరించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఎనిమిది దిక్కుల్లోని ప్రజలనూ కలిసిన విలేకరులకు విభిన్న స్వరాలు వినిపించాయి. నగర అభివృద్ధికి కృషి చేస్తోందంటూ బీఆర్‌ఎస్‌ సర్కారుకే పెద్దపీట వేస్తామనేవారితోపాటు వానలొస్తే ముంపు ఇబ్బందులు అంతగా తప్పించలేని ప్రభుత్వాన్ని ప్రస్నిస్తున్న వారూ లేకపోలేదు.

రోజురోజుకూ విస్తరిస్తున్న నగరం మరింతగా అభివృద్ధి చెందాలని, తిరిగి ఇదే ప్రభుత్వం వస్తే అభివృద్ధి మరింత వేగంగా కొనసాగే అవకాశముందని కొందరు ప్రత్యేకించి చెప్పడం గమనార్హం. ఫ్లై ఓవర్లతో నగర రూపురేఖలే మారాయని, ఐటీని మేటిగా నిలుపుతున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుంటామన్న వారితో పాటు ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ తదితర రంగాల్లో నగరం ఎంతో పురోగతి సాధించిందని, కాకపోతే ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని ధిక్కార స్వరాన్ని వినిపించిన వారూ ఉన్నారు..  ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి  కొనసాగాలంటే ఇదే ప్రభుత్వం బెటరనే అభిప్రాయాల్ని ఎక్కువమంది వ్యక్తం చేశారు.

కొత్త వారొస్తే.. మళ్లీ మొదటికొస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దినసరి కూలీల నుంచి ఐటీ ఉద్యోగుల దాకా, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారి నుంచి చిరువ్యాపారుల దాకా, ఇరవయ్యేళ్ల నవయువ ఓటర్ల నుంచి అరవయ్యేళ్లు పైబడిన వారిదాకా, మహిళల్లో గృహిణుల  నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నవారి దాకా విభిన్న వర్గాల ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా అత్యధికులు సుస్థిర ప్రభుత్వం మేలని అభిప్రాయపడగా.. మిగతా వారు మార్పు కోరుకుంటూ అంతరంగం వెలిబుచ్చారు. 

కారిడార్‌ 1
పోచారం, నారపల్లి, బోడుప్పల్, ఉప్పల్‌  
శివార్లకు ప్రాణం పోయండి 
పదేళ్లుగా తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందని ఎక్కువమంది అభిప్రాయపడగా, పెరిగిన నిత్యావసరాలతో సామాన్యులు బతకలేని పరిస్థితులేర్పడ్డాయని, డబ్బున్న వారు మరింత సంపన్నులు కాగా, పేదలు మరింత నిరుపేదలయ్యారని వాపోయిన వారూ ఉన్నారు.  

భారతీయ సంస్కృతిని  పరిరక్షించడంతోపాటు ప్రపంచ దేశాల్లో భారత్‌ గౌరవాన్ని పెంపొందించే నాయకత్వం కావాలన్న వారు సైతం ఉన్నారు.  శివారు ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనలో మరింత దృష్టి పెట్టాలని, కనీస వసతులు, రవాణాను రాబోయే ప్రభుత్వాలు ప్రధాన అంశాలుగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కోర్‌సిటీపైనే దృష్టి పెట్టారు, ఈ దశలో శివార్ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఆశిస్తున్నారు. 

అభివృద్ధి బాగుంది  
పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి  జరిగింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలంటే  మరోసారి అధికారపార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది.  – జశ్‌రామ్, వ్యాపారి, నారపల్లి 

ఈ విడతలోనే అభివృద్ధి   
కేసీఆర్‌ నాయకత్వంతోనే రాష్ట్రం మరింత అభివృద్ధిని   సాధించగలదు. అందరికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశమిద్దాం అనే అలోచన కంటే అభివృద్ధిని చూసి ఓటేద్దామని ఆలోచించడం మంచిది.  – అరుణ, వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకురాలు, జోడిమెట్ల.  

మార్పు కావాలి    
బీఆర్‌ఎస్‌ వల్ల పేదలకు చాలా అన్యాయం జరిగింది. డబ్బున్నవాళ్లే మరింత ధనవంతులయ్యారు. పేదవాళ్లు ఇంకా నిరుపేదలయ్యారు. కాంగ్రెస్‌ మొదటి నుంచీ పేదల పార్టీ. ఆ పార్టీయే   అధికారంలోకి రావాలి. –విజయ్, టిఫిన్ బండి నిర్వాహకుడు, ఉప్పల్‌ 

కారిడార్‌ 2
రామంతాపూర్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లిబర్టీ, ఖైరతాబాద్‌ 
సంక్షేమానికి మొగ్గు 
అభివృద్ధికి ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న ప్రస్తుత సర్కారుకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.  సంక్షేమ పథకాలు అందుకుంటున్న వర్గాలు అధికంగా ఉండడం,ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు జై కొట్టడం గమనార్హం. మరోవైపు స్థానిక అభ్యర్థులపై  అభిమానంతో కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఆరు గ్యారంటీలపై చర్చ జరుగుతున్నా అంతిమంగా ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ బీజేపీకి కొంత అనుకూలత కనిపించింది.  

సమస్యలపై అవగాహన ఉంది  
కాంగ్రెస్‌ పార్టీపై అభిమానం ఉంది.  స్థానిక అభ్యర్థికి సమస్యలపై అవగాహన  ఉంది. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నా.   –రంగనాథ్, వ్యాపారి, వెంకటేశ్వరనగర్‌ 

సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాం 
తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అందజేసిన వివిధ సంక్షేమ  పథకాలతో  లబ్ధి పొందాం. ఇంకా మేలు జరుగుతుందేమోనని ఎదురుచూస్తున్నాం. కొత్తవారైతే ఎక్కువేమైనా చేస్తారేమోననే ఆశ ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – నోముల రాములు, మార్బుల్‌ మేస్త్రీ అంబర్‌పేట 

బీఆర్‌ఎస్‌తోనే నగరాభివృద్ధి  
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం­లోనే హైదరాబాద్‌ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి  చెందింది. ఐటీ మంత్రి కేటీఆర్‌ అంటే నాకెంతో అభిమానం ,ప్రేమ.  ఆయన వల్లనే నగరం అన్నిరంగాల్లో ముందుకెళ్లింది. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌కు  మంచి భవిష్యత్‌ ఉంటుంది.   –రాజేందర్, విద్యార్థి, ఖైరతాబాద్‌ 

కారిడార్‌ 3
అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్‌ 
మెట్రో విస్తరణ ప్రథమ ఎజెండా కావాలి 
ప్రస్తుత ప్రభుత్వంలో చాలా పనులు జరిగాయని, మార్చాల్సిన అవసరమైతే కనిపించడం లేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా లోపాల్లేకున్నా, స్థానికంగా ఉండే నేతలు సైతం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో  ఓటర్లు బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు.  ప్రధానంగా మెట్రోపై తమ అభిప్రాయాలను వివరించారు.

మెట్రో రాకతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయని , విస్తరణను నగర ప్రథమ ఎజెండాగా బీఆర్‌ఎస్‌ తీసుకోవాలని మెజార్టీ ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఉండడం, వారు అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం వస్తే బావుంటుంది కానీ, వారి వర్గ పోరుతోనే సమస్య అన్న వాళ్లు ఉన్నారు.  

ప్రభుత్వంలో లోపాల్లేవు 
కేసీఆర్‌ పాలనలో నాకు ఏ లోపాలు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సుస్థిర ప్రభుత్వం కొనసాగాలంటే. తిరిగి కేసీఆర్‌కు జై కొట్టాలి. – ఉత్తేజ్, సినీనటుడు, జూబ్లీహిల్స్‌ 

వేరే ఆప్షన్‌ లేదు  
ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అంతమాత్రాన ప్రభుత్వాన్నే మార్చాలనుకోవడం తగదు. స్థానికంగా కొన్ని సమస్యలున్నా,  బీఆర్‌ఎస్‌ కంటే మంచి ఆప్షన్‌ కనిపించడం లేదు.  – ఆకుల ప్రవీణ్‌కుమార్, ఐస్‌క్రీమ్‌ మెషిన్ల వ్యాపారి

ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి   
బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లేయమంటున్నారు. గెలిచాక కూడా అలాగే ప్రజల్లో తిరగాలి. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తే ప్రజలు ఎప్పుడూ వారివెంటే ఉంటారు.   –మహేష్ చౌదరి, అమీర్‌పేట 

కారిడార్‌ 4
కొంపల్లి, బాలానగర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ 
ఐటీలో మేటి..
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతోనే ఐటీలో మెరుగ్గా నిలిచామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే కనిపించే భారీ అంతస్తుల భవనాలు, కేబుల్‌బ్రిడ్జి వంటివి నగరంలోనూ కనిపిస్తున్నాయని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.  ప్రధానంగా ఐటీ రంగం అంచలంచెలుగా ఎదుగుతోందని, పేరొందిçన కంపెనీలు రావడం కేవలం కేటీఆర్‌ కృషి వల్లేనని చెప్పారు.

ఐటీ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌గా మారిపోయిందని, మున్ముందు మరింత ఖ్యాతి పొందే అవకాశం ఉందన్నారు.  కొందరు మాత్రం తాము దరఖాస్తు చేసుకున్నా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు రాలేదని అసంతృప్తి  వ్యక్తం చేశారు. ఈ పథకం కొందరికే చుట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఐటీ అభివృద్ధి  చెందింది 
నగరంలో ఐటీ బాగా అభివృద్ధి చెందింది. లింక్‌రోడ్లతో ప్రయాణం సాఫీగా మారింది. సీఎం కేసీఆర్‌ కులవృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి  చెందింది.   – మహే ష్ చారి, చందానగర్‌ 

గుణగణాలను చూసే ఓటేస్తా 
తెలంగాణ ప్రభుత్వం అందించే పింఛన్‌ వస్తోంది. డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇంటికి దరఖాస్తు చేసుకున్నాం. కానీ రాలేదు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థి గుణగణాలను చూసి ఓటేస్తాం.      –రమ, పాన్‌షాపు, లింగంపల్లి 

పేదలకు న్యాయం జరగాలి 
నాకు అరవయ్యేళ్లు దాటాయి. వృద్ధాప్య పెన్షన్‌ రావడం లేదు. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే అదీ రాలేదు.     –  వెంకటేశ్వర్లు, చిరువ్యాపారి, హఫీజ్‌పేట 

కారిడార్‌ 5
సాగర్‌రింగ్‌రోడ్,  బాలాపూర్, ఆర్‌సీఐ, శంషాబాద్‌ 
ఒకవైపే కాదు.... రెండో వైపు చూడండి 
గతంతో పోలిస్తే గడచిన తొమ్మిదిన్నరేళ్లలో అభివృద్ధి జరగడాన్ని అంగీకరిస్తూనే, వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం కూడా పట్టించుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆయా ఎమ్మెల్యేలు కేవలం తమ సన్నిహితులు, తమ అనుచరులు, కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ పేదలను విస్మరిస్తున్నారన్న వాదనలను వ్యక్తం చేశారు. అన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను సమన్యాయంతో అమలు చేయాలని కోరేవారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపించారు.

పదేళ్లలో తమను పట్టించుకోలేదని, పేదలందరికీ న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడితే బావుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ గురించి మౌత్‌ పబ్లిసిటీ పెద్ద ఎత్తున ఉన్నా ఇక్కడ స్థానిక నాయకత్వం యాక్టివ్‌గా ఉన్నట్టుగా కనిపించడంలేదు. బీజేపీ కాస్త మెరుగ్గా ఉన్నా ప్రచారంలో దూసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎల్‌బీనగర్‌ చౌరస్తా రూపురేఖలే మారిపోయాయని, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపిన బీఆర్‌ఎస్‌కు అక్కడ కొంత మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది.

అర్హులకు నిరాశే మిగిలింది 
నేను పక్కా తెలంగాణవాదిని. ఒకే పార్టీకి రెండుసార్లకంటే ఎక్కువ పాలనాధికారాలు అందిస్తే నిరంకుశత్వంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోంది. సంక్షేమ పథకాలన్నీ అధికారపార్టీ ప్రతినిధులు, వారికి అనుకూలమైన వారి జేబుల్లోకే వెళుతున్నాయి. అర్హులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి.  –  కాకి నవీన్‌గౌడ్, ప్రైవేట్‌ ఉద్యోగి, కర్మన్‌ఘాట్‌ చౌరస్తా 

ఉచితాలు కాదు ఉపాధి కావాలి 
నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. చదివితే కొలువు సాధించవచ్చని ఇంట్లో కొట్లాడి హాస్టల్‌లో  ఉంటూ డిగ్రీ వరకు చదివాను. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఉద్యోగం రాలేదు. గత్యంతరం లేక ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నా. నిరుద్యోగ యువతకు ఉచితాలు వద్దు. ఉపాధి కావాలి. 
– బెయిన సుధాకర్, నిరుద్యోగి, సాయిరాంనగర్‌కాలనీ చౌరస్తా 

పెద్దకొడుకు మా కేసీఆర్‌ 
 రాష్ట్ర సొంతింటి పెద్ద కొడుకు మా సీఎం కేసీఆర్‌. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పెన్షన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, దళిత, బీసీ, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి నేనున్నానని∙భరోసా ఇస్తున్నాడు. మాకు ఇంకేం కావాలి. కాంగ్రెస్‌కు  పాలన అందిస్తే సాగు, తాగునీటి కష్టాలు తప్పవు. రోజుకు మూడు గంటలే కరెంట్‌ ఇచ్చి చీకటి చేస్తరు. బీజేపీకి అధికారం ఇస్తే స్థానిక సమస్యలను గాలికి  వదిలేస్తారు.  –పోతురాజు జంగయ్య, దుర్గానగర్, అడ్డాకూలీ 

కారిడార్‌ 6
నాగోల్, కొత్తపేట, నల్లగొండ చౌరస్తా, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌  
స్వచ్ఛ మూసీ ఎక్కడ? ట్రాఫికర్‌ తీరేదెలా? 
ఈ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. వ్యాపారులు, ప్రైవేట్‌ ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో  బీజేపీకి మొగ్గు చూపినవారూ ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రయోజనాలు అందలేదని కొందరు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.

కేంద్రంలో మోదీ విధానాలకు ఆకర్షితులైన వారు బీజేపీకి పట్టం కడతామంటున్నారు. స్వచ్ఛ మూసీ విషయంలో బీఆర్‌ఎస్‌ అశ్రద్ధ చేసిందనే వాదనలు కొంతమంది వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ అత్యంత ఇబ్బందులకు గురిచేస్తోందని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం కావాలన్నవారు చాలామందే ఉన్నారు. నిత్యం ట్రాఫిక్‌ జాం, భారీ సంఖ్యలో వాహనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. 

పేదలకు న్యాయం జరగలేదు  
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్‌ పార్టీ వస్తే అన్ని వర్గాల ప్రజలు బతకవచ్చు. పెరిగిన నిత్యావసరాల ధరలతో  పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇస్తాం.   – నర్సింహ, ఆటోడ్రైవర్, మోహన్‌నగర్‌  

సుస్థిర ప్రభుత్వం ఉండాలి  
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఎలాంటి ఆటంకాల్లేకుండా ఐటీ సెక్టార్‌ హైదరాబాద్‌లో బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని జిల్లాలకు ఈ సెక్టార్‌ను విస్తరించడం మంచి పరిణామం. ఇంకా అభివృద్ధి జరగాలి. అందుకు సుస్థిర ప్రభుత్వం ఉండాలి.   – సాయిసుమంత్, ఐఐఎం గ్రాడ్యుయేట్, దిల్‌సుఖ్‌నగర్‌

కారిడార్‌ 7
సికింద్రాబాద్, జేబీఎస్, బోయిన్‌పల్లి, అల్వాల్‌ 
ఆచరణ సాధ్యమేనా...

మాస్‌ ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లకు నెలవైన ఈ ప్రాంతంలో అధికార బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున తమ మద్దతు వ్యక్తం చేశారు. పదిమందిలో సగం మంది కారుకే వేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలు పొందామన్నారు.

 ఇవే హామీలు కాంగ్రెస్‌ కూడా ఇస్తుందని ‘సాక్షి’ ప్రశ్నించగా కాంగ్రెస్‌ గ్యారంటీలమీద తమకు నమ్మకం లేదని, ఆచరణ సాధ్యం కాదని పలువురు చెప్పారు. ఒకవేళ ఇవ్వగలిగితే కేసీఆర్‌ ఇచ్చేవాడు కదా? అవి సాధ్యం కాలేనివి కాబట్టే బీఆర్‌ఎస్‌ చెప్పలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపేవారు కాదని, వారి ప్రచారం కూడా అంతంతే ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మళ్లీ కేసీఆరే రావాలి 
రాష్ట్రంలో పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ అంతే స్థా­యి­లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వమే మళ్లీ గెలవాలి. కంటోన్మెంట్‌లో సాయన్న చొరవతో నిరు­పేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయి. పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఇలా అన్ని రకాల ప్రయోజనాలు దక్కాయి. కంటోన్మెంట్‌లో మరోసారి ఆ పార్టీకే అవకాశాలున్నాయి.      – నారాయణముదిరాజ్, అంబేడ్కర్‌నగర్‌ 

బీసీబంధు బీజేపీకే ఓటు 
బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీకే మా మద్దతు. నియో జకవర్గంలోని బీసీలంతా బీజేపీకే ఓటు వేస్తారని ఆశిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కంటోన్మెంట్‌లో బీజేపీ గెలిస్తేనే ఎంతో అభివృద్ధి జరుగుతుంది.     –  సురేశ్, మారేడుపల్లి 

కారిడార్‌ 8
చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాందీభవన్‌ 
ప్రశాంతతకే పట్టం కడతాం 
పాతబస్తీ ప్రజలతోపాటు ఈ కారిడార్‌లోని పలువురు వ్యాపారులు ఎంఐఎంనే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. గోషామహల్‌  ప్రాంతంలో మిశ్రమ స్పందన  కనిపించింది. కొందరు బీజేపీ, మరి కొందరు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల పట్ల మొగ్గు చూపారు. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ నాయకత్వం పట్లనే అసక్తి కనబర్చారు. ప్రధానంగా మైనార్టీల సంక్షేమం పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, షాదీముబారక్, రంజాన్‌ తోఫా, విద్య, వైద్యం విషయంలో బీఆర్‌ఎస్‌ కృషిని మరిచిపోలేమన్నారు. మైనార్టీలంతా ఎంఐఎం వైపు ఉంటామని తెలంగాణవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. 

ఇదే పాలన కొనసాగాలి  
తొమ్మిదేళ్లుగా పర్యాటక కేంద్రం చార్మినార్‌ ప్రశాంతంగా ఉంది. చిరువ్యాపారాలపై ఒత్తిడి లేదు. శాంతి భద్రతల విఘాతం సమస్యలేదు. పరస్పర సహకారం  బాగుంది. పాతబస్తీలో అసెంబ్లీ స్థానాలతోపాటు  రాష్ట్రంలో కూడా ఇదే పాలనా కొనసాగాలి. – షేక్‌ చాంద్, చిరువ్యాపారి,  చార్మినార్‌ 

బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది 
రాష్ట్రంలో మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. ముస్లిం సంక్షేమం, చేయూ త బాగుంది. విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఉచితంగా పేదపిల్లలకు చదువు లభిస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే బాగుటుంది.  –ముజాహిద్, అత్తర్‌ వ్యాపారి. యాకుత్‌పురా 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు 
గత పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ పాలించింది. ప్రస్తు­తం మార్పు అవసరం. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి – మహ్మద్‌ ఖలీల్, వ్యాపారి, ఓల్డ్‌సిటీ 

Advertisement

What’s your opinion

Advertisement