దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్

16 Aug, 2021 15:10 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్: హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లిలోని దళిత బంధు ప్రారంభోత్సవ సభకు  చేరుకున్న సీఎం కేసీఆర్‌.. జై భీమ్‌ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

రైతుల్లో ధీమా పెరిగింది
రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్‌ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు.

21 వేల దళిత కుటుంబాలు
ఇంకా మాట్లాడుతూ.. ‘దళితబంధుకు మొత్తం 22 వేల కోట్లు ఇస్తాం. నేను హుజురాబాద్‌లో స్వయంగా తిరిగి దళితబంధు అమలును పరిశీలిస్తా. దళిత బంధుకు కిస్తీలు కట్టే కిరికిరి అవసరం లేదు. దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలి. హుజురాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లుసమగ్ర సర్వేలో తేలింది. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అనమానులు, అపోహలే.  ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం:

నూటికి నూరుశాతం అమలు
దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతోంది. వచ్చే నెల, రెండు నెలల్లో అందరికి దళితబంధు వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం. నూటికి నూరుశాతం దళితబంధు అమలు చేస్తాం. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. ఎస్సీల్లో పేదలకు ముందుగా దళితబంధు వర్తిస్తుంది.’ అని పేర్కొన్నారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు అందించారు.

మరిన్ని వార్తలు