రాజాసింగ్‌ సస్పెన్షన్‌ ఓ డ్రామా.. టీఆర్‌ఎస్‌తోనే అది సాధ్యమైంది: అసదుద్దీన్‌

30 Aug, 2022 01:57 IST|Sakshi

ఆయనకు ఇంకా బీజేపీ మద్దతు ఉంది

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ ఒక నాటకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ నాటకమాడుతోందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజాసింగ్‌కు బీజేపీ మద్దతు  కొనసాగుతోందన్నారు.

జైలులో ఉన్న ఆయనను విడిపించేందు కు బీజేపీ తీవ్రంగా ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నందునే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ ను వెంటనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపించిందని, ఢిల్లీలో శాంతిభద్రతల అంశం కేంద్రం చేతుల్లో ఉండటంతో నుపుర్‌శర్మని అరెస్ట్‌ చేయలేదన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.  

మాంసాహారంపై నిషేధమా?: కర్ణాటకలో గణేశ్‌ చతుర్థి సందర్భంగా మాంసాహారంపై నిషేధం విధించడమేమిటని ఒవైసీ మండిపడ్డారు. బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని బీజేపీ యత్నిస్తోందని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో 80 శాతంమంది ప్రజలు నాన్‌వెజ్‌ తింటున్నారని పేర్కొన్నారు.

హోటళ్లలో యథేచ్ఛగా నాన్‌వెజ్‌ దొరుకుతుండగా, పేదల కోసం నాన్‌వెజ్‌ షాపులు తెరిస్తే మాత్రం అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. మాంసం విక్రయించేవాళ్లలో అత్యధికులు ముస్లిం వర్గానికి చెందినవారేనన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో హక్కులు అణచివేతకు గురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

మొరాదాబాద్‌లో ముస్లింలను నమాజ్‌ చేయకుండా నిలిపివేయడంపై ఒౖవైసీ మండిపడ్డారు. నమాజ్‌ చేయడానికి అనుమతి తీసుకోవాలా, ఇది ముస్లింలపట్ల ద్వేషాన్ని స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, ముస్లింలను అణిచివేసేందుకు అన్నిచోట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌ జయేశ్‌ షాకు సంబంధించిన ఓ ప్రశ్నపై ఒవైసీ స్పందిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం భారత్‌పై ఉన్న ప్రేమను రుజువు చేయదని అన్నారు.    

మరిన్ని వార్తలు