ఏఎస్‌డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు

20 Oct, 2023 04:40 IST|Sakshi

చనిపోయిన, ఇళ్లు మారిన, గైర్హాజరీలో ఉన్నవారితో ప్రత్యేక ఓటర్ల జాబితా 

బోగస్‌ ఓటింగ్, రిగ్గింగ్‌ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం 

అధికారుల బదిలీకి ఈసీ ఎలాంటి కారణాలు తెలపలేదు 

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం–12డీ పంపిణీ ప్రారంభించాం 

నవంబర్‌ 15లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డుల పంపిణీ 

నవంబర్‌ 10 తర్వాత ఓటరు స్లిప్పుల పంపిణీ 

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ 

ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా?  
వికాస్‌రాజ్‌: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్‌ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం.  

కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? 
ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్‌ 15లోగా పంపిస్తాం. నవంబర్‌ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం.  

హైదరాబాద్‌లో పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు?  
పోలింగ్‌ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌’తోపాటు ఈసీఐ వెబ్‌సైట్‌లోని ‘ఓటర్‌ సహాయ మిత్ర’ అనే లింక్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్‌ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్‌ కేంద్రాలు మారొచ్చు. 

ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? 
పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి.  

పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఎలా పొందాలి?  
80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్‌ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్‌ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్‌మెంట్‌ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు.

ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్‌ పత్రాన్ని కవర్‌లో ఉంచి సీల్‌ చేసి ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్‌ ఫెసిలిటేటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చి ఓటు వేయించుకుంటాం.  

ప్రగతి భవన్‌లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్‌ సినిమా, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా?   
ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. 

ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? 
బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. 

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్‌ తిరస్కరిస్తారా? 
అఫిడవిట్‌లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ను తిరస్కరించరు. అన్ని కాలమ్‌లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు.   

నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి?  
త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం.  

ఆన్‌లైన్‌ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా?  
యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి.  

రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి?  
ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు