ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..

10 Oct, 2023 08:23 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్, చిత్రంలో ఎస్పీ , ఐటీడీఏ పీవో

నవంబర్‌ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్‌

నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌

పత్రాలు లేకుండా రూ.50వేలకు మించి తీసుకెళితే సీజ్‌  కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆదిలాబాద్‌: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అ న్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్‌ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్‌ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్‌లెట్‌ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ నియమించినట్లు తెలిపారు.

అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్‌ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్‌ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్‌ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్‌ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు