మహువా మొయిత్రా వివాదం: తొలిసారి మౌనం వీడిన మమత

23 Nov, 2023 16:25 IST|Sakshi

కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరణ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  తొలిసారి స్పందించారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడిన దీదీ ఇదంతా ముందస్తు ప్లాన్‌ ప్రకారం జరిగిన కుట్ర అని బీజేపీపై మండి పడ్డారు. అయితే ఇది వచ్చే ఏడాది (2024) ఎన్నికల ముందు మహువాకే సాయం  చేస్తుందని వ్యాఖ్యానించారు.  గురువారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ చీఫ్‌  మమత, మహువా మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. 

వివిధ కేసులలో తమ పార్టీ నాయకులను అరెస్టు చేసిన తర్వాత, లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించే అవకాశం ఉందని, మొయిత్రాను లోక్‌సభ నుంచి తప్పించాలనేదే బీజేపీ ప్లాన్‌ అని, అయితే ఈ కుట్రలు మహువా మరింత పాపులర్ కావడానికి దోహద పడతాయని పేర్కొన్నారు.  ఇపుడామె బయట మాట్లాడగలుతున్నారన్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని,కేవలం మూడు నెలలు మాత్రమే మోదీ  సర్కార్‌  ఉంటుందన్నారు. అంతేకాదు ప్రత్యర్థి నాయకులే  లక్ష్యంగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల తరువాత బీజేపీని  వెంటాడుతాయంటూ జోస్యం చెప్పారు.

కాగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు పెను దుమారాన్ని రాజేశాయి. దీనిపై బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఏర్పాటైన 15 మంది సభ్యుల ఎథిక్స్‌ కమిటీ మహువాను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయాలని సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు