బాపట్లలో బాహాబాహీ

28 Jan, 2024 04:04 IST|Sakshi

టీడీపీ కార్యాలయంలోనే డిష్యుమ్ డిష్యుమ్  

ఐ టీడీపీ వర్సెస్‌ పార్టీ పట్టణ విభాగం

కమ్మ, యాదవ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు

తెలుగుదేశం తీరుపై బీసీ నేతల భగ్గు 

బాపట్ల టౌన్‌: తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రం బాపట్లలోని టీడీపీ కార్యాలయంలోనే ఆ పార్టీ ఐ టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాహాబా హీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. రా తేల్చుకుందాం అంటూ తొడలు చరుచుకున్నారు.

మాటల తీవ్రత పెరిగి, దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యకర్తల సమక్షంలోనే కలబడ్డారు. ఇదే అదునుగా పార్టీకి చెందిన కమ్మ, యాదవ సామాజిక వర్గాలు రెండుగా విడిపోయి చెరో పక్షం చేరి సవాళ్లు విసురుకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటన తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలను మరోమారు బట్టబయలు చేసింది.  

అసలేం జరిగిందంటే.. 
బాపట్ల మండలంలోని రెండో క్లస్టర్‌ పరిధి నాయకులతో ఐ టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. సమావేశం జరుగుతుండగా అక్కడే ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ‘‘ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? సమావేశాల్లో మినహా గ్రౌండ్‌ లెవల్‌లో ఐ టీడీపీ ఎక్కడా పనిచేస్తున్నట్లు లేదు’’ అని అనడంతో ఒక్కసారిగా మానం శ్రీనివాసరావు ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్ని అడిగేందుకు నువ్వెవరు? అంటూ దురుసుగా మాట్లాడుతూ గొలపలపైకి దూసుకొచ్చారు.

గొలపల కూడా అంతే స్థాయిలో నేనెవరో నీకు తెలీదా? అంటూ ఎదురుతిరిగారు. ఒక్కసారిగా ఇద్దరూ తన్నులాటకు దిగారు. దూషణలు చేసుకుంటూ, తొడలు చరుచుకున్నారు. వీరు తన్నులాటకు దిగడంతో ఓ వైపు కమ్మ సామాజిక వర్గం నాయకులు, మరోవైపు యాదవ సామాజిక వర్గం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడికి యత్నించారు. వెంటనే స్పందించిన పార్టీ నాయకులు ఇరువర్గాలకూ సర్దిచెప్పారు. 

యాదవ నేతపై గతంలోనూ దాడి 
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న ముసలం శనివారంతో బట్టబయలైంది. గతంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ, అతని తనయుడు రాకేష్‌ వర్మ యాదవ సామాజికవర్గానికి చెందిన మద్దిబోయిన రాంబాబుపై తనకు రావాల్సిన డెకరేషన్‌ డబ్బులు అడిగాడనే కోపంతో దాడి చేశారు. దీంతో రాంబాబు బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే  శనివారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన మానం శ్రీనివాసరావు కూడా వర్మ, అతని తనయుడి బాటలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి దిగడంతో ఒక్కసారిగా బీసీ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి తమ సత్తా చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega