కాంగ్రెస్‌ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం: విజయసాయిరెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం: పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి

Published Mon, Feb 5 2024 3:42 PM

MP Vijaya Sai Reddy Slams On Congress In Rajya Sabha Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఏనాడూ లేదని.. ఇప్పుడు దాన్నొక ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టారాయన. 

‘‘కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో  కచ్చితంగా చెప్పారు. కానీ, అది  కంటి తుడుపు హామీ అయ్యింది.  ఏపీపై కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు.. ఎందుకు ఆ అంశాన్ని విస్మరించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో కాంగ్రెస్‌ ఫెయిల్ అయ్యింది. హోదాను చట్టంలో చేర్చడం కాంగ్రెస్‌కు  చేతగాక ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు?.. 

.. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు. ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారు అని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

అందుకే కాంగ్రెస్‌కు ఆ శిక్ష
ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గౌరవించలేదు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయం గా రాష్ట్రాన్ని విభజించారు . ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించింది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. అసలు ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలోని ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. కుటుంబ వ్యవహారంలో తల దూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు ఉదాహరణ. తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. 

కాంగ్రెస్‌ లేకుంటేనే..
.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసింది. గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఏపీకి చేసిన మోసానికి ఈ శిక్ష పడింది. ఇది సరిపోదు.. ఇంకా శిక్ష పడాలి. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అదృశ్యమైంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లకు మించి కాంగ్రెస్‌ గెలవదని మమతా బెనర్జీ అంటున్నారు. 2014లో అమేధీలో రాహుల్‌ గాంధీ ఓడారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి ఖాయం. 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యం. కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయింది.  కాంగ్రెస్ పాలనాకాలంలో భారతదేశం వెనకడుగు వేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. అంటే.. కాంగ్రెస్‌కు అధికారం లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నమాట. ఈ స్లోగన్‌కు ఆ పార్టీ గోడలపై రాసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement