యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్‌ స్కెచ్‌!

12 Dec, 2023 07:21 IST|Sakshi

భోపాల్‌:మధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌యాదవ్‌ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో  హ్యాట్రిక్‌ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్‌ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు స్టేట్‌లలో యాదవ జనాభా డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే యాదవ్‌ వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌ను బీజేపీ మధ్యప్రదేశ్‌కు సీఎంను చేస్తోందని పొలిటికల్‌ పండిట్‌లు విశ్లేషిస్తున్నారు.

అంతేగాక మోహన్‌ యాదవ్‌ భార్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆయనను సీఎం చేస్తే ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మోహన్‌​ యాదవ్‌ మామయ్య యూపీలోని సుల్తాన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌,బీహార్‌లలో కలిపి మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పవర్‌లోకి రావాలనేది కమలనాథుల టార్గెట్‌ అని స్పష్టమవుతోంది.

మోహన్‌ యాదవ్‌ ఎంపికతో యాదవ్‌ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్‌​ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.   

ఇదీచదవండి..జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్‌ షా

>
మరిన్ని వార్తలు