రాంచీ టు శామీర్‌పేట

3 Feb, 2024 04:20 IST|Sakshi

హైదరాబాద్‌ శిబిరానికి జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు 

రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఏఐసీసీ నిర్ణయం 

ప్రత్యేక విమానంలో వచ్చిన 41 మంది జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

దీపాదాస్, పొన్నం, సంపత్‌లకు సమన్వయ బాధ్యతలు  

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్‌ సోరెన్‌ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ క్యాంప్‌కు తరలించారు.

రాంచీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు వారికి ఆహ్వనం పలికి రెండు ప్రత్యేక బస్సుల్లో శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ముగ్గురు నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. 

బలపరీక్ష జరిగేవరకు ఇక్కడే.. 
జార్ఖండ్‌లో పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ నేతలు బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ ముఖ్యులతో టచ్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యేలను క్యాంపు కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తామనే సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నమే వీరు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా పడింది. కాగా ఏఐసీసీ నేతలు ఆదేశాల మేరకు టీపీసీసీ వీరి క్యాంపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మాజీ జెడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్‌ పేరిట శామీర్‌పేట రిసార్ట్స్‌లో 38 రూంలు వీరి కోసం బుక్‌ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలంతా మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల ఐదో తేదీన జార్ఖండ్‌ అసెంబ్లీలో చంపయ్‌ సోరేన్‌ బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం లేదంటే ముందు రోజు అర్ధరాత్రి వారు ప్రత్యేక విమానంలో రాంచీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

శిబిరానికి సీఎం రేవంత్‌! 
శుక్రవారం ఇంద్రవెల్లి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా క్యాంపునకు వెళ్లి జార్ఖండ్‌ ఎమ్మెల్యేలను కలుస్తారని గాం«దీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారన్న ఆలోచనతో వారిని హైదరాబాద్‌కు తరలించాలని ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా క్యాంపు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను టీపీసీసీ పూర్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు రిస్టార్టుకు వెళ్ళారు.

whatsapp channel

మరిన్ని వార్తలు