దీదీ చేతులు రక్తంతో తడిశాయి : నడ్డా

6 May, 2021 08:30 IST|Sakshi

కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినాటి నుంచి కొనసాగుతున్న దాడులు, అల్లర్లు, రాజకీయ హింస నుంచి బెంగాల్‌ను, బెంగాల్‌ ప్రజలను కాపాడు తానని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతిజ్ఞ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌కు వచ్చిన నడ్డా బుధవారం కోల్‌కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ‘నార్త్‌ 24 పరగణాల సహా పలు జిల్లాల్లో అమానుష దాడుల్లో చనిపోయిన బీజేపీ సభ్యుల కుటుంబాలను కలుస్తా. ఇక్కడి దారుణ ఘటనల వివరాలను మొత్తం భారతావనికి తెలియజేస్తా. బెంగాల్‌ ప్రజలకు బీజేపీ సేవా కార్యక్రమాలు ఇకపైనా కొనసాగుతాయి. హింస కారణంగా 14 మంది బీజేపీ కార్య కర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయా రు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్ష మంది స్థానికులు సొంతూర్లను వదిలేసిపోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉందిగనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారు. హింసను ప్రేరేపించిన మమత చేతులు రక్తంతో తడిశాయి. గత ఏడాది అంపన్‌ తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణంగా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాళీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు