‘ప్యాకేజీపై దత్తపుత్రుడి అలక.. బాబు రాయబారం’

18 Dec, 2023 18:49 IST|Sakshi

అవి ప్యాకేజీ చర్చలు

పుత్రుడు-దత్తపుత్రుడి మధ్య ఆధిపత్యపోరు.. బాబు సెటిల్‌మెంట్‌

లోకేష్ పాద యాత్ర ఒక చేదు మాత్ర

అమరావతి ఒక్కటే రాజధాని అంటే సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు మీ గల్లా పట్టుకుంటారు

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు భేటీ కావడంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.  అవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అలకబూనితే.. బాబు రాయబారం కోసం వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. పుత్రుడు-దత్తపుత్రుడు మధ్య ఆధిపత్య పోరును బాబు సెటిల్‌మెంట్‌ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రవిచంద్రారెడ్డి. 

ప్యాకేజీ చర్చలకు అంత హడావుడా..?
చంద్రబాబుకు వత్తాసుపలికే ఎల్లోమీడియా పైత్యం రోజురోజుకు శృతిమించి పోతుంది. అత్యంత పారదర్శక పాలనతో జగన్‌ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోన్న తరుణమిది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్నో అంశాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతోంది. ఈరోజు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతూ పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా రాష్ట్రమంతా మన్ననలు అందుకోంటుందని చెప్పుకోవడానికి మేం గర్వపడుతోన్నాం.

అయితే, ప్రజల మేలు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తోన్న ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు రాయడానికి ఎల్లోమీడియాకు మనసు రాదుగానీ.. తెలంగాణ రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్‌ ఇంటికి చంద్రబాబు వెళ్లినప్పుడు.. చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్‌ వెళ్లినప్పుడు ఆ ఎల్లోమీడియా చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. మన రాష్ట్రంలో లేని వ్యక్తులు పక్కరాష్ట్రంలో ఉన్న ఇళ్లకు వెళ్తే... అక్కడ గంటలతరబడి చర్చించుకుంటే మన రాష్ట్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏముంటుంది..? పవన్‌కళ్యాణ్, చంద్రబాబులు ఒకరింటికి మరొకరు వెళ్లడమనేది లోక కళ్యాణార్థమన్నట్టు వారి ప్యాకేజీ పొత్తుల చర్చలకు ఎల్లోమీడియా అంతగా ప్రాధాన్యతనివ్వాల్నా.? అని ప్రశ్నిస్తున్నాను. 

నూటికి నూరుశాతం ‘పవన్‌’ ప్యాకేజీ స్టారే
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మేము ప్యాకేజీ స్టార్‌ అన్నప్పడల్లా ఆయన ఉలికులికిపడుతూ ఎగిరెగిరిపడుతుంటాడు. చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మధ్య సంబంధాలన్నీ ప్యాకేజీతో ముడిపడినవేననేది జగమెరిగిన సత్యం. వారు ఇద్దరూ కలిసినప్పుడల్లా చర్చ పవన్‌కళ్యాణ్‌కు టీడీపీ నుంచి ఎంత ప్యాకేజీ అందించాలనే అంశంపైనే అనేది వాస్తవం. అందుకే, మేము ఖచ్చితంగా ఒకటే చెబుతున్నాం. పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి రాజకీయాల్లో ప్యాకేజీ కోసమే పనిచేస్తున్నాడని అంటున్నాం. నూటికి నూరుపాళ్లూ ఆయన్ను ప్యాకేజీస్టార్‌ అనడంలో తప్పేమీలేదని స్పష్టంచేస్తున్నాం.

ప్యాకేజీపై దత్తపుత్రుడి అలక.. బాబు రాయబారం
టీడీపీ నుంచి వరుసగా వస్తున్న ప్యాకేజీతోనే జనసేన పార్టీ నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ దత్తపుత్రునికి సరిపోవడంలేదనే విషయంపై కొంత చర్చ జరుగుతున్న అంశం. అందుకే చంద్రబాబు కొడుకు లోకేశ్‌ తలపెట్టిన యువగళం ముగింపు సభకు మొదట పవన్‌కళ్యాణ్‌ హాజరుకావడంలేదన్నాడు. దీంతో నేరుగా చంద్రబాబు రాయబారానికి సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్‌లో పవన్‌ ఇంటికి ఆయన వెళ్లి మాట్లాడి బుజ్జగించినట్లు మాకున్న సమాచారం. వారిరువురి మధ్య దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చ అంతా కూడా ప్యాకేజీ పొత్తుపైనే అని మేం సూటిగా చెబుతున్నాం. ఇందులో వాస్తవం లేదని చెప్పే ధైర్యం పవన్‌కళ్యాణ్, చంద్రబాబుకు ఉందా ..? అని అడుగుతున్నాను. 

పుత్రుడు-దత్తపుత్రుడి మధ్య ఆధిపత్యపోరు
చంద్రబాబు కొడుకు లోకేశ్‌ పెత్తనమంటేనే ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు ఏమాత్రం నచ్చడంలేదు. ఇరువురి మధ్య గత కొంత కాలంగా పార్టీల పొత్తు చర్చల నేపథ్యంలో ఆధిపత్యపోరు కొనసాగుతుంది. అందుకే, లోకేశ్‌తో కలిసి ఒకే వేదికపై ఉండటం పవన్‌కు ఇష్టంలేదు. కానీ, వారిద్దరి మధ్య సంధి ప్రయత్నం చేసి పవన్‌కు అందించే ప్యాకేజీ కాస్త ఎక్కువైనా సంబంధాన్ని ఒడ్డున పడేయాలని కోరుకుంటూ రాయబారం నడిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.

జెండాలు వేరైనా దోపిడీనే వారి అజెండా
సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడ్ని అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈరోజు ఒక చేతిలో తెలుగుదేశం పార్టీ జెండా, మరో చేతిలో జనసేన పార్టీ జెండా పట్టుకున్నాడు. రెండు పార్టీలకు జెండాలున్నప్పటికీ, అజెండా మాత్రం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలోకి తొక్కి,  ప్రజాధనాన్ని ఏవిధంగా దోపిడీ చేయాల్నా అనేదే పెట్టుకుని పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, పేదల మేలు పట్టని ఆ రెండు పార్టీల అజెండాపై ప్రజల్లోనూ చర్చ జరుగుతూనే ఉంది. గతంలో టీడీపీ, జనసేన పొత్తు పేరిట 2014 ఎన్నికల ముందు ప్రజలకు చూపించిన మ్యానిఫెస్టోలో 609 హామీల్ని  అధికారంలోకి రాగానే చంద్రబాబు తుంగలో తొక్కాడు. మరి, అప్పట్లో ఆయన్ను ప్రశ్నించలేని పవన్‌కళ్యాణ్‌ .. ఇప్పుడు ప్రశ్నిస్తాడా..?

కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి మరీ..
కాపుల మేలును, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టుపెట్టడమే ధ్యేయంగా పార్టీ పెట్టి పనిచేస్తున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్‌. అతనికి తన అభిమానులు గానీ.. తనను నమ్మి వెంటనడిచే సొంత సామాజికవర్గ నేతలెవరూ అవసరం లేదు. అతనికి కావాల్సిందల్లా తనకు ఎంత ప్యాకేజీ వస్తుందనేదే. అవసరాన్ని బట్టి కాపు సోదరుల్ని, తన అభిమానులను చంద్రబాబు దగ్గర నిలువునా తాకట్టుపెడుతున్న రకం మనిషి ఈ పవన్‌కళ్యాణ్‌. 

సీట్ల సర్దుబాటుపై తెల్ల మొఖం వేసిన పవన్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 50 సీట్లు జనసేనకు ఇవ్వాలని అడగమంటూ జనసేన నాయకులు పవన్‌కళ్యాణ్‌కు సూచిస్తున్నారు. అయితే, 25 సీట్లైనా ఇవ్వడానికి తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేశ్‌ సుముఖంగా లేకపోతే..మొఖం నల్లబోయిన పవన్‌కళ్యాణ్‌ నిన్న జాయింట్‌ ప్రెస్‌మీట్‌కూ హాజరుకాలేకపోయాడు. మాట్లాడకుండా ముఖం చాటేశాడు. 

టీడీపీ, జనసేన నడుమ సంధి ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాబోయే ఎన్నికల తుపాన్‌ను తట్టుకోలేక ఆ రెండు పార్టీలు తికమక పడుతున్నాయి. ప్రధానంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. సంక్షేమం, అభివృద్ధిని రాష్ట్రంలో పరుగులెత్తిస్తోంది గనుక పాజిటివ్‌ ఓటు సునామీలో  కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లో ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరమైతే, వైఎస్‌ఆర్‌సీపీ ధాటికి ముక్కచెక్కలవుతామని వారు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. 

ఊబకాయం తగ్గించుకునేందుకు చేసిన యాత్ర
నానాటికీ, ప్రజల్లో ఉనికి కోల్పోతున్న టీడీపీ.. మరోవైపు దత్తపుత్రుడి కోరికలు తీర్చలేకపోవడంతో ఆయనెక్కడ దూరమవుతాడోననే ఆందోళన చంద్రబాబుది. ఇదికాకుండా, తన సొంత పుత్రుడి అగచాట్లును కవర్‌ చేయలేక తండ్రిగా చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. నారా లోకేశ్‌ రాష్ట్రంలో 226 రోజుల పాదయాత్ర చేశాడట.. 3వేల కిలోమీటర్లు నడిచేశాడంట. దాన్ని యువగళం పేరిట పెద్ద యాత్రగా చెబుతున్నాడు. నిజానికి, అది అతని ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చేపట్టిన ఒ చిన్న ప్రయత్నంగా చేసిన యాత్రగా చెప్పుకోవాలి. రాత్రివేళల్లో అందరూ నిద్రించాక నియోజకవర్గాల్ని, జిల్లాలనూ దాటుకుని వెళ్లిన కలరింగ్‌ యాత్ర అది.

లోకేష్ యాత్ర చేదు మాత్ర
టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రం లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్ర ఒక చేదుమాత్రగా మిగిలింది. ఎవరైనా తాను అధికారంలోకి రాకముందు ప్రజలతో మమేకమై.. వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటూ .. సమస్యల్ని పరిశీలిస్తూ వాటిని ఎలా పరిష్కరిస్తామో చెబుతూ అన్ని ప్రాంతాలనూ కలిపే యాత్రను పాదయాత్ర అంటారు. కానీ, లోకేశ్‌ యాత్ర మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. తమ కార్యకర్తల్ని ఏదోరకంగా 12కు మించకుండా క్రిమినల్‌ కేసులు పెట్టించుకోవాలంటూ.. తాను రెడ్‌బుక్‌ రాస్తున్నానంటూ అందులో తన శత్రువుల పేర్లు రాస్తున్నానంటూ ఊదరగొడుతూ చేసిన యాత్ర అది. మరి, తనమీదనో, తన తండ్రి మీదనో కేసులొచ్చిపడప్పుడు రెడ్‌బుక్‌ పక్కనబెట్టి బెంబేలెత్తిపోయి ఢిల్లీకి పారిపోయి, మీడియా ముందే ఏడుపు లంఘించుకున్న వైనం అందరూ చూశారు. అంటే, ఆయనపైన కేసులనగానే ఏడుస్తాడు గానీ.. కేసులు పెట్టించుకుని యువత భవిత పాడు చేయడమే యువగళం లక్ష్యంగా యాత్ర చేశాడా..? అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీది యువగళం కాదని అదొక యువగరళం అని మేం మొదట్లో అన్న మాటను లోకేష్ నిరూపించుకున్నాడు. 

పెట్టుబడిదారుల ఉద్యమం అది
చంద్రబాబుకు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు  తాను కలలు గన్నట్టు కొనసాగడం లేదనే బాధతో మతిభ్రమించేదేమో. నిన్న అమరావతి రైతుల ఉద్యమానికి నాలుగేళ్లైందని సంబరాలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది. అమరావతి టు అరసవెల్లి యాత్రప్పుడు రైతుల ఐడెంటీ కార్డులడిగినప్పుడే వారంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే కదా..? గత నాలుగేళ్లుగా ఉద్యమంలో ఉందీ, నడిపిస్తుందంతా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులేనని చంద్రబాబు తెలుసుకోవాలి. రైతుల్లేని పెట్టుబడిదారుల ఉద్యమానికి నాలుగేళ్లైందని చెబితే ఎంతైనా సబబుగా ఉంటుంది. 

ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఓట్లడిగే హక్కుందా..?
కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ.. వికేంద్రీకరణే మా నిర్ణయం అని ఇప్పటికీ చెబుతున్నాం.  మరి, మీరు అమరావతి ఒక్కటే రాజధాని అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వస్తే.. అప్పుడు మీకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఆ రెండు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి మాకనవసరం... అమరావతి ప్రాంతంలోని ఒకే ఒక సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమని మీరు చెప్పగలరా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ విధంగా మీరు తీర్మానించిన మరుక్షణమే మిమ్మల్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా ప్రజలు తీర్మానిస్తారు. అలాంటప్పుడు మీకెందుకు ఓట్లు వేయాలని ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకుని నిలదీస్తారని హెచ్చరిస్తున్నాం. 

>
మరిన్ని వార్తలు