కర్ణాటక ఎన్నికలు: 1985 నుంచి అదే ట్రెండ్‌.. బీజేపీ ఆ సెంటిమెంట్‌ను ‍బ్రేక్‌ చేస్తుందా?

13 Apr, 2023 16:03 IST|Sakshi

కర్ణాటకలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ మార్పు అనేది మాత్రం సూచిస్తున్నట్లు ‘పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఏమనగా.. రాష్ట్రంలో 1985 నుంచి వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మరి బీజేపీ రానున్న ఎన్నికల్లో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయగలదా లేదా అనేది ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. 

సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అడగగా..
ప్రస్తుత ముఖ్యమంత్రిగా పని చేస్తున్న బసవ రాజు బొమ్మైకి 20 శాతం మద్దతు ఇచ్చారు. మాజీ సీఎంలు సిద్ధరామయ్య, బి.యడియురప్పకు సానుకూలంగా 32 శాతం, 25 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు 5 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నించగా..  కాంగ్రెస్‌ అని 42 శాతం, బీజేపీ అని 38 శాతం, జేడీ (ఎస్‌) అని 14 శాతం మంది స్పందించారు.

బీజేపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశమిస్తారా అన్న నిర్దిష్ట ప్రశ్నకు 51 శాతం మంది ఇవ్వమని, 43 శాతం ఇస్తామని, ఆరు శాతం మంది చెప్పలేమనీ బదులిచ్చారు. ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే, ఏయే పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని అడగగా... కాంగ్రెస్‌ పార్టీ జేడీ (ఎస్‌)తో చేతులు కలపాలని 46 శాతం మంది చెప్పారు. 41 శాతం మంది బీజేపీ-జేడీ (ఎస్‌) కూటమిగా ఏర్పడాలని భావించారు. కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌)-ఇతరుల కూటమికి ఆరు శాతం, బీజేపీ-జేడీ(ఎస్‌)-ఇతరుల కూటమికి ఏడు శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారు. 

యాత్రలు 
►విజయ్‌ సంకల్ప యాత్ర (బీజేపీ) : బీజేపీ చేపట్టిన విజయ్‌ సంకల్ప యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. మరోవైపు బీజేపీ చేపట్టిన బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ ప్రచారం విజయవంతం అయ్యింది.
► ప్రజాధ్వని యాత్ర (కాంగ్రెస్‌) : కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. 
► పంచరత్న యాత్ర (జేడీఎస్‌) : జేడీఎస్‌ చేపట్టిన పంచరత్న యాత్ర సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది.

►బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు రాష్ట్రంలో తక్కువగా పర్యటించారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో అనేకమార్లు విస్తృతంగా పర్యటించగా, కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రాష్ట్రంలో ఒకటి, రెండు మార్లే పర్యటించారు.
►కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డులను అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ గ్యారెంటీ కార్డుల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కూడా జరగలేదు. 
►పీపుల్స్‌ పల్స్‌ ప్రతినిధులు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడి, గ్రూపులవారీగా మాట్లాడి రాజకీయ పరిస్థితులను పరిశీలించి అక్కడ ఏ పార్టీవైపు మొగ్గు ఉందో ఒక అంచనాకు వచ్చారు.

అవినీతి ఎన్నికల ప్రధాన ప్రచారాంశం
ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులలో, పథకాల అమలులో ‘40% సర్కార్‌’(కమీషన్లు) ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రధానమైనవిగా ఉండగా కమలం పార్టీ వాటిని సవరణ చేసింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగాలకు, లింగాయత్‌లకు పంచింది. 

కీలకం కానున్న ప్రజా సమస్యలు
రోడ్ల దుస్థితిపై ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. పాత పెన్షన్‌ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి ముందుకొచ్చే పార్టీకే మద్దతివ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. మతతత్వ అంశాలు, హిందుత్వ అంశాలు కోస్తా కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. వొక్కలింగాల యోధులైన ఊరిగౌడ, నంజేగౌడలను టిప్పు సుల్తాన్‌ హత్య చేసిన అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఆ సామాజిక వర్గాల మద్దతును కూడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ కోరుకున్నట్లు వొక్కలింగాల పూర్తిమద్దతు ఆ పార్టీకి లభించడం లేదు. వారు, మొదటి ప్రాధాన్యత జేడీ (ఎస్‌)కు, రెండో ప్రాధాన్యత కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు