కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి తథ్యం

12 Nov, 2023 00:56 IST|Sakshi
ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో రాజాసింగ్‌

కేటీఆర్‌కు కూడా బీజేపీ చేతిలోనే పరాభవం: కిషన్‌రెడ్డి జోస్యం 

మజ్లిస్‌తో బీజేపీ దోస్తీ అంటూ కాంగ్రెస్‌ నేతలవి సిగ్గులేని మాటలు 

సూర్యుడు పడమట ఉదయించినా ఎంఐఎంతో కలవబోమని స్పష్టి కరణ 

బీజేపీలో చేరిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ కూడా ఓడిపోతారన్నారు. బీజేపీ అభ్యర్థుల చేతుల్లోనే వారికి పరాభవం వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు, అన్ని సీట్లు అని కేటీఆర్‌ చెబుతున్నారని, ఆయన చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా పరిస్థితులున్నాయన్నారు.

శనివారం కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్, సుదర్శన్‌ సింగ్‌ రాథోడ్, విద్యావేత్త బాలాజీ నాయక్, బీఆర్‌ఎస్‌ నాయకులు జబ్బార్‌ నాయక్, శ్రీరాములు తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ సంపాదనను కక్కిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి, మాఫియా, కుటుంబపాలనతో కూడిన చీకట్లను తరిమి.. బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా డిసెంబర్‌ 3న నిజమైన దీపావళి రావాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలోని కారు చీకటి పోయి, మరో కమ్ముకున్న చీకటి (కాంగ్రెస్‌) రాకుండా కమలం పువ్వుతో లక్ష్మీదేవి వచ్చేలా చూడాలని చెప్పారు.  

భూములు అమ్మితేనే జీతాలు 
సీఎం కేసీఆర్‌ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను దగా చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలు, హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి బీఆర్‌ఎస్‌ పోయి ఇక్కడ కాంగ్రెస్‌ వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్లుగా అధికారంలో లేమని కాంగ్రెస్‌ నేతలు ఆవురావురు మంటున్నారని, రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

మజ్లిస్, బీజేపీ రెండూ ఒకటేనంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ఇతరనాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎంఐఎంను పెంచి పోషించి లాభపడింది కాంగ్రెస్‌ కాగా, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మజ్లిస్‌ను మోస్తోందని విమర్శించారు. సూర్యుడు పడమట ఉదయించినా ఎంఐఎంతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. మతతత్వ, రజాకార్ల పార్టీతో బీజేపీ కలవబోదన్నారు. కర్ణాటకలో ఐదు నెలల పాలనలోనే ఐదేళ్ల అసంతృప్తిని, వైఫల్యాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఐదు గ్యారంటీలంటూ కర్ణాటక ప్రజల తలలపై భస్మాసుర హస్తం పెట్టి కాంగ్రెస్‌ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించిందన్నారు. ఆ పార్టీ ట్రాక్‌రికార్డ్‌ ఘోరంగా ఉంటే ఆరు గ్యారంటీలతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటూ గొప్పలకు పోతోందన్నారు.

మరిన్ని వార్తలు