టీడీపీ వెనక కాదట.. పక్కన నడుస్తున్నారట..!

4 Dec, 2023 12:24 IST|Sakshi

కొంత కాలం క్రితం బహుశా 2019 ఎన్నికలు ముందు అనుకుంటా!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అందులో మనం ఎంతకాలం తెలుగుదేశంకు బానిసత్వం చేస్తామని గట్టిగా గొంతు చించుకుని ప్రశ్నించారు. కాపులను ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నారు. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అప్పట్లో టీడీపీలో ఉండేవారు.ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతికి ద్రోహం చేస్తావా? అంటూ ప్రశ్నించారు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది.

✍️ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చిందా అని చూస్తే అసలు విషయం అర్ధం అయింది. పవన్ కళ్యాణ్్ తాజాగా మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఉపన్యసిస్తూ తెలుగుదేశం పార్టీని జనసేనవారు ఎవరైనా ఏమైనా అంటే తాను ఊరుకోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో టీడీపీ,జనసేన పొత్తుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలను సహించబోనని అన్నారు. టీడీపీ వారిని నిందించడానికి వీలు లేదని అన్నారు. తాను టీడీపీ వెనుక నడవడం లేదని, పక్కన నడుస్తున్నానని చెప్పుకున్నారు. అంతేకాదు..ఆయన రాజకీయాన్ని, సిద్దాంతాన్ని బీజేపీ పెద్దలు కూడా అర్ధం చేసుకున్నారట.

✍️ఇలా ఏవేవో మాట్లాడడం వింటే ఎవరికైనా మతిపోవలసిందే! పవన్ కళ్యాణ్ తనను తాను మోసం చేసుకుంటున్నారా?లేక జనసేన కార్యకర్తలందరిని మోసం చేస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. టీడీపీకి జనసేనవారు కాని, కాపులు కాని బానిసలు కాదని  చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు అంతగా ఆ పార్టీకి లొంగిపోయారు? దానిని బానిసత్వం అని అనరా! తాను కాబట్టి పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా పార్టీని నడుపుతున్నానని చెప్పారు. నిజమే. తాను,నాదెండ్ల మనోహర్ , మహా అయితే తన సోదరుడు నాగబాబులే పార్టీగా నడుపుతున్న ఘనత ఆయనదే. ఉండేది హైదరాబాద్‌లో. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేది మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి , బహుశా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏపీలో వారాహి వాహనం ఎక్కి ముఖ్యమంత్రి జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని దూషించుకుంటూ తిరగడం తప్ప ఏమి చేశారు.

✍️పార్టీకి నిర్దిష్ట కమిటీలు ఉన్నాయా? గ్రామ స్థాయి నుంచి పార్టీని నెలకొల్పడానికి ప్రయత్నించారా? ఆ దిశలో ఎన్నడైనా ఆలోచించారా? ఏదో సినిమా యాక్టర్ కాబట్టి ,అమాయకపు అభిమానులు, తెలిసి తెలియని వయసులో ఉన్న వారు ఆయన సభలకు హాజరై, ఆయనేమి చెబుతున్నారో వినకుండానే చప్పట్లు, ఈలలు కొడుతుంటారు.అది చూసి ఇదంతా తన బలమే అనుకుని ఈయన మురిసిపోతుంటారు. అసలు ప్రపంచంలో  మరో పార్టీపై ఆధారపడి , ఆ పార్టీవారు ఏమన్నా పడి ఉండండి అని సొంతపార్టీవారికి చెప్పే ఏకైక నేత పవన్ కళ్యాణ్ మాత్రమే కావచ్చు.ఈ మధ్య మాత్రం టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కు జిందాబాద్ కొడుతున్నారు. అది ఎందుకో అందరికి తెలుసు! పవన్ అభిమానులనండి.. ఆయన ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆశపడే కాపులను మాయ చేయడానికే అన్న సంగతి ఎవరికైనా అర్ధం అవుతుంది. పవన్ నాయకత్వం వర్దిల్లాలి అని అంటున్న లోకేష్ మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం లేదు? సరే పవన్ కళ్యాణే ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

✍️తాను ఆ పదవికి అంత అర్హుడిని కానని ఒకసారి, పదవి ఇస్తే తీసుకుంటానని మరోసారి ...ఇలా ఏదో మాట్లాడుతూ పార్టీవారిని గందరగోళంలో పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ ప్రజలలో కాకపోయినా, కనీసం తన పార్టీ కార్యకర్తల ప్రశ్నలు లేదా సందేహాలకైనా జవాబు ఇవ్వాలి కదా! తెలంగాణలో బీజేపీ తో పొత్తు పెట్టుకుని జనసేన పోటీచేస్తే అక్కడ ఎందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు? అది జనసేనను అవమానించడానికి కాదా? కాపు సామాజికవర్గం నేతలు స్వయంగా కుకట్ పల్లిలో టీడీపీ వారికి ,కమ్మవారికి విజ్ఞప్తి చేసి జనసేనకు ఓటు వేయమని అడిగినా కూడా ఫలితం లేకపోయిందే!దాని గురించి ఒక్క ముక్క ఎందుకు పవన్ మాట్లాడడం లేదు.ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిసినప్పుడు జనసేన తెలంగాణ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వండని ఎందుకు అడగలేకపోయారు? అది సొంత పార్టీ అభ్యర్ధులకు వెన్నుపోటు పొడవడం కాదా? అలాంటివాటిని ప్రశ్నిస్తారనే కదా  తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ముందుగా మీటింగ్ తంతు నడిపి ఎవరూ మాట్లాడవద్దని హూంకరించింది? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని అడిగితే ఈయనేమి  జవాబిస్తారు.

✍️రాష్ట్ర ప్రజల కోసమే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ 2019 కి ముందు టీడీపీ అంత అవినీతి పార్టీ లేదని ఎలా అన్నారు!బీజేపీని వదలివేసి బిఎస్పి ,సిపిఐ,సిపిఎం లతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? రెండు చోట్ల పోటీచేసి దారుణ పరాజయం చెందిన తర్వాత మళ్లీ బీజేపీ పెద్దలను బతిమలాడుకుని వారితో స్నేహం ఎందుకు చేయవలసి వచ్చింది?తెలంగాణలో బీజేపీతో  పొత్తు పెట్టుకుని ఏపీలో పెట్టుకుంటారో,లేదో ఎందుకు చెప్పలేకపోతున్నారు?ఇలా అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ చివరికి తన సొంత పార్టీ కార్యకర్తలనే బెదిరించే స్థితికి చేరుకోవడం ఓ ట్రాజెడి. ఇందులోనే ఆయన బలహీనత కనిపిస్తుంది.కులం పునాదుల మీద పార్టీని నడుపుతూ , అదే కులం వారిని వేరే పార్టీకి లొంగిపనిచేయాలని అంటే ఆత్మగౌరవం ఉన్నవారెవరైనా దానిని సహించగలుగుతారా? తాను మాట ఇస్తే నిలబడతానని ఉపన్యాసాలలో చెబుతూ, ఆచరణలో పూర్తి విరుద్దంగా ఎన్ని మాటలు మార్చుతుంది వీడియో సహితంగా కనిపిస్తున్న సాక్ష్యాల గురించి ఏమి  వివరణ ఇస్తారు?వీటన్నిటికన్నా పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఒక్క మాట చెబితే బాగుండేది.

✍️ఈసారి కూడా తాను అసెంబ్లీకి ఒంటరిగా గెలవలేనని, అందుకే తన భవిష్యత్తు కోసం టీడీపీతో కలుస్తున్నానని చెప్పుకుని ఉంటే కొంతమందైనా హర్షించేవారు. అలాకాకుండా పైకి ఒకటి,లోపల మరొకటి పెట్టుకుని దానికి సిద్దాంతం ,విధానం వంటి డైలాగులు చెబితే వినడానికి ప్రజలు కాదు కదా.. జనసేన కార్యకర్తలు కూడా సిద్దంగా ఉండరని తెలుసుకోవాలి!


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

>
మరిన్ని వార్తలు