రేవంత్‌కు అధికారమిస్తే కోఠిలో అమ్మేస్తాడు

30 Oct, 2023 04:33 IST|Sakshi

కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంట్‌ పెట్టే రకం వాళ్లు 

బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం భేటీలో మంత్రి కేటీఆర్‌ 

టీఎస్‌పీఎస్సీని డిసెంబర్‌ 3 తర్వాత ప్రక్షాళన చేస్తాం 

బీజేపీ ఫేక్‌ న్యూస్‌ ప్రచారాలను విస్తృతంగా ఎండగడదాం  

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ. అమరుల స్తూపం వద్దకు వ­చ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడు. నోట్లకట్టలతో పచ్చిగా దొరి­కిన దొంగ నీతులు చెప్తున్నాడు. కాంగ్రెస్‌ వాళ్లే రేవంత్‌రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠిలో చారాణాకు అమ్మేస్తాడు. అందుకే కాంగ్రెస్‌ పార్టీని నమ్మొద్దు..’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ వాళ్లు బతిమాలుతున్నారని.. ఎందుకు చాన్స్‌ ఇవ్వాలని ప్రశ్నించారు.

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ డబ్బు సంచులతో వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో ఐదు గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని డీకే చెప్పడంపై నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని పేర్కొన్నారు. 

టీఎస్‌పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం 
‘‘గతంలో ప్రశ్నపత్రాలు లీక్‌ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ చెంచా గాడు కాదా? గ్రూప్‌–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేసిందే బండి సంజయ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌. ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే గొడవ చేసిందీ వీళ్లే. కోర్టులో కేసు వేసి గ్రూప్‌–2 పరీక్షను రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్‌ పెడతారు వాళ్లు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకుంటున్నా.

డిసెంబర్‌ 3 తర్వాత టీఎస్‌పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటా..’’అని కేటీఆర్‌ ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదికల ద్వారా తిప్పికొట్టి వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్‌ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్‌ మీడియా వేదికగా దీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్ల వయసున్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. 2014 ముందు నాటి పరిస్థితులను వారికి తెలియచేయాలని.. ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వారి డొల్లతనాన్ని బయట పెట్టాలని సూచించారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, స్వామి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేటల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్‌ చేరికతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తితోనే తాను బీఆర్‌ఎస్‌లో చేరినట్టు ఎర్ర శేఖర్‌ అన్నారు. ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ వివిధ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు