బీజేపీ, కాంగ్రెస్‌ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్‌

14 Jan, 2024 20:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. రానున్న లోక్‌సభ ఎ‍న్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని, కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. 

బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్‌ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోందని అన్నారు.

ఇక.. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ రెండుగా చీలి పోతుందని అన్నారు.

చదవండి: రేవంత్‌ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌


 

>
మరిన్ని వార్తలు