TS: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? | Sakshi
Sakshi News home page

చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ?

Published Sun, Jan 14 2024 3:56 PM

Triangular Fight In Chevella MP Constituency    - Sakshi

సాక్షి,చేవెళ్ల: ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్న ఈ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అందుకే ఈ పార్లమెంట్ సీటు మీద పట్టు సాధించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. 

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న చేవెళ్ళ పార్లమెంటరీ స్థానాన్ని 2009లో ఏర్పాటు చేశారు. ఒకవైపు అర్బన్, మరోవైపు రూరల్ నియోజకవర్గాలు కలగలసి ఉన్న చేవెళ్ళలో పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరపున రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. 2014లో గులాబీ పార్టీ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓడిపోయారు. కొండా ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా చేవెళ్లలో పాగా వేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేవెళ్ళ మీద పట్టు బిగించాలని చూస్తోంది. అదేవిధంగా గత రెండుసార్లు గెలిచిన చేవెళ్ళను మూడోసారి గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ ఆశిస్తోంది. 

చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. గ్రేటర్  హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కమలం పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రై యాంగిల్ పైట్ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.  నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. 

ఇక ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఆ కీలక నేతనే చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ కనిపిస్తోంది. లేనిపక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇంఛార్జీగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్ గా తీసుకుంటే బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరపున బరిలో దించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు.. స్థానికంగా పట్టు ఉండటం.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండటం.. మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా ? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చివరకు ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

ఇదీచదవండి.. గులాబీ బాస్‌ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ 

Advertisement
Advertisement