అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే: మంత్రి కేటీఆర్‌

15 Oct, 2022 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు కంట కన్నీరు తూడ్చే పరిస్థితి దేశంలో లేదని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయం పెంచుతామని చెప్పిన మోదీ కేవలం అంబానీ, అదానీల ఆదాయం మాత్రమే పెంచారని దుయ్యబట్టారు. ధాన్యం సేకరణను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లాని కేంద్రం చూస్తోందని... అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లేనని అన్నారు. ఆకుపచ్చ కండువా కప్పుకొని రైతుల ఓట్లు దండుకునే వాళ్లే ఉన్నారు తప్ప రైతులకు మేలు చేసే వారు లేరని విమర్శించారు. ప్రపంచ ఆహార సూచికలో 116 దేశాలని సర్వే చేస్తే గతంలో 101 ఉండే భారత్‌ ఇప్ప్పుడు 6 స్థానాలు దిగజారి 107కు పడిపోయిందని  ప్రస్తావించారు..

హైదరాబాద్‌లోని మన్నేగూడలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది అందరికి తెలుసని, కరెంట్ కోసం అడుక్కున్న రోజులు ఆనాడు ఉండేనని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని స్పష్టం చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో 15 నిమిషాలు కరెంట్‌ పోతే ఆగమాగం పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా చూపెట్టాలని ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌ విసిరారు. 
చదవండి: మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!

నల్లగొండ జిల్లాలో ఒక్క రాజగోపాల్ రెడ్డి ఆదాయం మాత్రం పెంచాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, ఒక్కరే ధనవంతుడు అయితే నల్గొండ బాగుపడదని మంత్రి అన్నారు. రాజగోపాల్‌ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని విమర్శించారు. నూకలు తినమని చెప్పిన బీజేపీ నాయకులు తోకలు కట్‌ చేయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనమంటే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అవమానించేలా మాట్లాడారని ప్రస్తావించారు. కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చిందని, రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిందన్నారు. ప్రజలు తమ ఓటుతో రైతు వ్యతిరేకులైన బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు. 

‘పక్క రాష్ట్రం కర్ణాటక రైతులు కూడా ఇక్కడ కరెంట్ నీళ్లు వాడుకుంటున్నారని వాటిని అడ్డుకుందామని విద్యుత్ అధికారులు అంటే వద్దు రైతు ఎక్కడైనా రైతేనని చెప్పిన వ్యక్తి కేసీఆర్. రైతు బంధు ఇచ్చి రైతు పెట్టుబడి ఇస్తోంది కేసీఆర్. రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ అంటున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మోటర్ల దగ్గర మీటర్లు పెట్టనివ్వం. మీటర్లు పెట్టాలన్న మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలి.

ప్రిపేయిడ్ మీటర్లు పెడితే రోజుకో రేటు కట్టాల్సి వస్తుంది. ఇదే జరిగితే రైతులు వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తారు. పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్న మోదీని బొంద పెడుదమా వద్దా? ధాన్యం కొనమని కేంద్రం చెప్తోంది. కేంద్రం రైతులను తొక్కి చంపాలని చూస్తోంది. రైతు బాగుండాలని చూస్తోంది మా ప్రభుత్వం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు