పోటీ అనివార్యం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా–నేనా? ఆ ఒక్కరు ఎవరు!

14 Jun, 2022 10:54 IST|Sakshi

10 స్థానాలకు తొలుత 13 మంది పోటీ

చివరిరోజు నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇద్దరు అభ్యర్థులు

బరిలో ప్రస్తుతం 11 మంది అభ్యర్థులు

దీంతో రాజ్యసభ ఎన్నికల్లాగే పోటాపోటీగా జరుగుతాయని అంచనా

ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్న ఆఘాడీ, బీజేపీ

సాక్షి, ముంబై: విధాన పరిషత్‌ ఎన్నికలు అనివార్యమయ్యాయి. పది స్ధానాలకు గాను 13 మంది సభ్యులు నామినేషన్లు వేయగా అందులో చివరి రోజైన సోమవారం ఇద్దరు మాత్రమే ఉపసంహరించుకున్నారు. దీంతో పది స్ధానాలకు 11 మంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో ఇక విధాన్‌ పరిషత్‌ ఎన్నికల్లో పోటీ  అనివార్యమని తేలిపోయింది. దీంతో ఈ ఎన్నికలు కూడా రాజ్యసభ మాదిరిగానే హోరాహోరీగా జరగనున్నాయి. బీజేపీ, మహావికాస్‌ ఆఘాడి నేతలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెట్టనున్నారు.  

విధాన్‌ పరిషత్‌లో ఖాళీకానున్న 10 స్ధానాలకుగాను బీజేపీ, మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని మిత్రపక్షాలైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి మొత్తం 13 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రవీణ్‌ దరేకర్, ప్రసాద్‌ లాడ్, మాజీ మంత్రి రామ్‌ షిందే, మహిళామోర్చా అధ్యక్షురాలు ఉమా ఖాపరే, ప్రతినిధి శ్రీకాంత్‌ భారతీయ్‌ ఇలా ఐదుగురు అభ్యర్ధులు ఉన్నారు. అదే విధంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రయత్‌ క్రాంతి సంఘటన చీఫ్, మాజీ మంత్రి సదాభావు ఖోత్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో బీజేపీ తరపున ఐదుగురు, ఒకరు ఇండిపెండెంట్‌ ఇలా ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్‌ పవర్‌ షాక్‌

అదేవిధంగా శివసేన తరఫున మాజీ సహాయ మంత్రి సచిన్‌ అహిర్, అమషా పాడ్వీ నామినేషన్‌ వేయగా కాంగ్రెస్‌ నుంచి ముంబై ప్రదేశ్‌ అధ్యక్షుడు భాయి జగ్తాప్, చంద్రకాంత్‌ హండోరే నామినేషన్లు వేశారు. ఎన్సీపీ తరఫున విధాన్‌ పరిషత్‌ స్పీకర్‌ రామ్‌రాజే నాయిక్‌ నింబాల్కర్, ఏక్‌నాథ్‌ ఖడ్సే, శివాజీరావ్‌ గర్జే ఇలా మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో నామినేషన్లు ఉపసంహరణ గడువు ఆఖరు రోజున అంటే సోమవారం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రయత్‌ క్రాంతి సంఘటన చీఫ్, మాజీ మంత్రి సదాభావు ఖోత్, ఎన్సీపీ నుంచి శివాజీరావు గర్జే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆదేశాల మేరకు తను నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు సదాభావు ఖోత్‌ ప్రకటించారు.

చివరగా 10 స్ధానాలకుగాను 11 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు శివసేన, ఎన్సీపీ కలిసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ తమ రెండో అభ్యర్ధి నామినేషన్‌ ఉపసంహరించు కోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బీజేపీ తరఫున ఐదుగురు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తరఫున ఇద్దరు చొప్పున ఇలా 11 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరు మినహా మిగతా పది మంది అభ్యర్ధులకు విధాన్‌ పరిషత్‌కు వెళతారు. ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆ ఒక్కరు ఎవరుంటారు...? ఎవరు ఓడిపోతారనేది ఫలితాల్లో తేటతెల్లం కానుంది. 

విధాన్‌ పరిషత్‌లో ఎవరికెన్ని ఓట్లు..
► శివసేనకు 55 ఓట్లుండగా–ఇద్దరు అభ్యర్ధులకు సరిపోను ఒక ఓటు అదనంగా ఉంటుంది. 
► ఎన్సీపీకి 51 ఓట్లుండగా.. ఇద్దరు అభ్యర్ధులు గెలవాలంటే మూడు ఓట్లు కావాలి. 
► కాంగ్రెస్‌కు 44 ఓట్లుండగా ఇద్దరు అభ్యర్ధులు గెలవాలంటే 10 ఓట్లు కావాలి. 
► బీజేపీకి 106 ఓట్లుండగా–ఐదుగురు అభ్యర్ధులు గెలవాలంటే ఇంకా 29 ఓట్లు కావాలి. 
► ఇందులోంచి ఎన్ని ఓట్లు చీలిపోయి ఎవరిని గెలిపిస్తాయి..? ఎవరిని ఓడిస్తాయనేది ఉత్కంఠగా మారింది.  

మరిన్ని వార్తలు