హోంమంత్రితో వివాదాలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం

2 Apr, 2022 16:10 IST|Sakshi

 కేబినెట్‌పై పూర్తి విశ్వాసం ఉందన్న మహా సీఎం ఉద్ధవ్‌

సాక్షి, ముంబై: రాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌(ఎన్సీపీ)తో వివాదాలున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కొట్టి పారేశారు. ఒక్క పాటిల్‌పైనే కాదు.. మొత్తం కేబినెట్‌పైనా తనకు పూర్తి విశ్వాసముందని స్పష్టం చేశారు. మంత్రులందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని, తప్పుదారి పట్టించేందుకే అలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని ఉద్ధవ్‌ శుక్రవారం ఒక ప్రటకన విడుదల చేశారు.

రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీ నేతలను కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి ఫడ్నవీస్‌ ఆరోపణలపై.. హోంమం త్రివాల్సే అసెంబ్లీ సరైన సమాధానం ఇవ్వలేదని సీఎం అభిప్రాపడినట్లుగా వార్తలొచ్చాయి. కేబినెట్‌ సమావేశాల్లోనూ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాల్సే... శుక్రవారంనాడు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను పాలనాపరమైన అంశాలు చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వివరణ ఇచ్చిందని, అందరినీ పరిగణనలోకి తీసుకునే కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.  
చదవండి: బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి

అయితే అంతకుముందు.. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ బలంగా లేనందునే ఈడీ వంటి ఏజెన్సీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి హోంశాఖపై కేంద్రం దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా సీఎంతో ఉండాల్సిన హోంశాఖ ఎన్సీపీకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. అయితే రౌత్‌ చెప్పినదాంట్లో తప్పేం లేదని, అలాంటివేమైనా ఉంటే పరిష్కరిస్తామని వాల్సే తెలిపారు. హోంశాఖపై శివసేన దృష్టి పడిందా అన్న ప్రశ్నకు పాటిల్‌ సమాధానమిస్తూ తానలా భావించడం లేదని, చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి కేసులోనూ హోంశాఖమంత్రి ఉత్తర్వులు ఇవ్వలేరని చెప్పారు.

చాలా నిర్ణయాలు డీజీపీ, సీపీ, ఇతర ఉన్నతాధికారుల పరిధిలోనే జరిగిపోతాయని, ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రమే హోంశాఖ జోక్యం చేసుకుంటుందని వివరించారు. బీజేపీ పట్ల ఎన్సీపీ మెతకధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలను వాల్సే కొట్టిపారేశారు. మసీదుల్లో అజా(ప్రార్థన)లకు ఉపయోగించే లౌడ్‌స్పీకర్లను నిషేధించాలన్న బీజేపీ డిమాండ్‌ గురించి ప్రశ్నించగా... ధరల పెరుగుదల వంటి సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఇలాంటివి ముందుకు తెస్తుందని మండిపడ్డారు.                           

మరిన్ని వార్తలు