ఇందిరను తిట్టే స్థాయి నీకు లేదు కేసీఆర్‌: ఖర్గే ఫైర్‌

22 Nov, 2023 18:01 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీని తిట్టే స్థాయి కేసీఆర్‌కు లేదంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. 

కాంగ్రెస్‌ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేసీఆర్‌.. ఇందిరా గాంధీని కూడా తిడుతున్నారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే.  వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవు. హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది?. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మ. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం. దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం. హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారు?. మోదీతో అంటకాగడమే కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు ఆలంపూర్‌ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలే. తెలంగాణ ప్రజలు ఇచ్చే విజయ కానుకను భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుంది. ఆలంపూర్ చాలా పవిత్రమైన ప్రాంతం.. కృష్ణ, తుంగభద్రాల సంగమ ప్రాంతం. దేశంలో ఉన్న మూడు పత్రికల సుమారు 780 కోట్ల ఆస్తులను బీజేపీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ మూడు పత్రికలు నెహ్రూ సొంత ఆస్తి. నెహ్రూ స్థాపించిన ఈ మూడు పత్రికలు స్వతంత్ర పోరాటానికి ముఖ్య భూమికను పోషించాయి’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

‘నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయి. ఇందిరాగాంధీ నీ విమర్శిస్తున్నావు ఇందిరాగాంధీ ఎక్కడ.. మరి కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలిస్తున్నావు. 2017లో ఇచ్చిన నీ హామీలు ఏమయ్యాయి. ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీగా ఉన్న విజయశాంతి ఢిల్లీలో పార్లమెంట్‌లో సభ జరిగినప్పుడు తెలంగాణ కోసం స్పీకర్ పోడియంలోకి వెళ్లి 4, 5 గంటలు పోట్లాడింది. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావ్ కేసీఆర్. నువ్వు, నీ కొడుకు, కూతురు, అల్లుడు తెలంగాణను దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు