కీలక నిర్ణయం.. బీజేపీ బాటలో మమత

10 Jan, 2021 13:21 IST|Sakshi

కోల్‌కత్తా : దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకిస్తున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు ప్రత్యర్థిపై విమర్శల బాణాలు సందిస్తూనే అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజా ఆకర్శణ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కీలక హామీనిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆదివారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మమత ఇలాంటి ప్రకటన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (బీజేపీ వ్యూహం.. మమతకు చెక్‌)

కాగా గత ఏడాది చివరలో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇలాంటి హామీనే ఇచ్చిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. ఈ ప్రకటన భారీగానే ఓట్లను రాబట్టింది. అయితే  ఉచిత వ్యాక్సిన్‌ హామీపై దేశ వ్యాప్తంగా అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇలాంటి హామీని  ఇచ్చి ఇతర రాష్ట్రాల ప్రజలను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు సైతం వినిపించాయి. ఓ అడుగు ముందుకేసిన ప్రతిపక్షం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేసింది.

బీజేపీ బాటలో మమత..
ఉచిత వ్యాక్సిన్‌ ప్రకటనను పరిశీలించిన సీఈసీ దానిలో ఎలాంటి తప్పదంలేదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు రాదని తెలిపింది. దీంతో  కరోనా వ్యాక్సిన్‌కు రాజకీయ రంగం పులుముకుంది. బిహార్‌ ఎన్నికల అనంతరం జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే హామీని ప్రధానంగా ప్రచారం చేసింది. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏవిధంగా ఓట్లు దండుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ బాటనే ఎంచుకున్న మమతా బెనర్జీ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంగా ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీ హామీపై ముందుగానే కర్చిఫ్‌ వేసింది. తాము అధికారంలోకి వస్తే వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తామని సాక్ష్యాత్తూ సీఎం మమత ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, మున్సిపల్‌ కార్మికులు, పోలీసు సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు.

వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధం...
కాగా భారత్‌లో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 3 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు అందజేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తాజా పరిస్థితి, వ్యాక్సిన్‌ సన్నద్ధతపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో రాబోయే లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహూ తదితర పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల తర్వాత 50 ఏళ్ల వయసు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వీరంతా కలిపి 27 కోట్ల మంది ఉంటారని అంచనా. అక్స్‌ఫర్ట్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ వారి కోవాగ్జిన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లు సురక్షితమేనని, కరోనాకు వ్యతిరేకంగా మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది

మరిన్ని వార్తలు