Rajasthan Elections 2023: ఎన్నికల ప్రచారానికి తెర

23 Nov, 2023 18:57 IST|Sakshi

రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. 

రాజస్థాన్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు.

రూ.682 కోట్లు స్వాధీనం
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్‌ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు.

మరిన్ని వార్తలు