దమ్ముంటే రాజీనామా చెయ్యి : మంత్రి గంగుల

19 May, 2021 04:48 IST|Sakshi

పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు చెల్లిస్తా 

ముందు ఆక్రమించుకున్న భూములు స్వాధీనం చెయ్యి 

నేను ఫుల్‌ బీసీని.. నువ్వు హాఫ్‌ బీసీవి 

ఈటల ఆరోపణలకు మంత్రి గంగుల కౌంటర్‌ 

రాజకీయాలతో నేను ఆస్తులు పెంచుకోలే.. కరిగిపోయాయి..

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ఆత్మగౌరవం అని పదేపదే వల్లెవేసే ఈటల రాజేందర్‌ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోరాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సవాల్‌ విసిరారు. పదవులు, రాజకీయాలు శాశ్వతం కాదంటూనే వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో మాజీ మంత్రి ఈటల తనపై చేసిన విమర్శలకు గంగుల కౌంటర్‌ ఇచ్చారు.

 ‘1992 నుంచి మా కుటుంబం గ్రానైట్‌ బిజినెస్‌ చేస్తోంది. పన్నులు చెల్లిస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నాం. జిల్లా బొందలగడ్డ అయ్యిందంటున్నావు.. గ్రానైట్‌ క్వారీల లెక్కలు తీయి. నా గ్రానైట్‌ కంపెనీలపై సమైక్యాంధ్రలో విజిలెన్స్‌ కమిటీ క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. నీలాగా అసైన్డ్‌ భూములను, దేవాలయ భూములను ఆక్రమించుకోలేదు. ముందు అక్రమంగా పొందిన వందల ఎకరాలను సర్కారుకు సరెండర్‌ చెయ్యి ’ అని ఈటలను గంగుల సవాల్‌ చేశారు. 

తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నావు 
‘హుజూరాబాద్‌లో నువ్వు శూన్యంలో ఉన్నావు. మా పార్టీ బలంగా ఉంది. నీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం నాకు తెలియదు. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లు కొన్నామా? తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయారని అంటావా.. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అమ్ముడుపోయినట్టా? మాకు పదవులు ముఖ్యం కాదు. కేసీఆర్‌ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. 2018లో నా ఓటమిని కోరుకున్నావ్‌.. టీఆర్‌ఎస్‌ పతనాన్ని కోరుకున్నావ్‌. మేం వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు.

మాకు సంస్కారం ఉంది గనుకే మాట్లాడడం లేదు’ అని ఈటలపై గంగుల నిప్పులు చెరిగారు. ‘బిడ్డా’ అంటూ ఏకవచనంతో సంబోధించి మాట్లాడుతున్న ఈటల తన తీరు మార్చుకోవాలని, తాము నోరెత్తితే పరిస్థితి భయం కరంగా ఉంటుందని హెచ్చరించారు.  ‘నేను ఫుల్‌ బీసీని.. ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్‌ బీసీవి.. హుజూరాబాద్‌లో బీసీవి.. హైదరాబాద్‌లో ఓసీవి’’ అంటూ ఈటలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

పన్ను ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదురెట్లు చెల్లిస్తా 
తన గ్రానైట్‌ వ్యాపారంపై ఆరోపణలు శోచనీయమని, తాను పన్నులు ఎగ్గొట్టానని ఈటల నిరూపిస్తే ఐదు రెట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని గంగుల స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయని, 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా గ్రానైట్‌ క్వారీల అక్రమ వ్యాపారాన్ని ఎందుకు అడ్డుకోలేదని ఈటలను ప్రశ్నించారు. తమిళనాడుకు చెందిన గ్రానైట్‌ వ్యాపారుల నుంచి ఏ మేరకు ముడుపులు ముట్టాయో ఈటల వెల్లడించాలని గంగుల డిమాండ్‌ చేశారు. 

ముందు అసైన్డ్‌ భూములు అప్పగించు..
దళితులకు చెందిన అసైన్డ్‌ భూములను కొను గోలు చేసినట్లు ఒప్పుకున్న ఈటల వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలని గంగుల డిమాండ్‌ చేశారు. తాను రాజకీయాల్లో సంపా దించింది ఏమీ లేదని, ఆస్తులు కరిగిపోయా యని అన్నారు. విలేకర్ల సమావేశంలో హుజూ రాబాద్‌లోని మండలాల ఇన్‌చార్జిలుగా వ్యవ హరిస్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, మేయర్‌ వై.సునీల్‌రావుతోపాటు గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు శ్యాంసుందర్‌రెడ్డి, బల్మూరి ఆనందరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చల్ల హరిశంకర్, బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు