ఎస్‌ బాస్‌.. మేమూ మీ వాళ్లమే! | Sakshi
Sakshi News home page

ఎస్‌ బాస్‌.. మేమూ మీ వాళ్లమే!

Published Wed, Dec 6 2023 6:22 AM

- - Sakshi

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. దాదాపు పదేళ్లకు తర్వాత తొలిసారిగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభావం ఇతర విభాగాల కంటే పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. ఈ అంశంలో కొందరు అధికారుల్లో మోదం.. మరికొందరిలో ఖేదానికి కారణమైంది. ఒకప్పుడు కొందరు నాయకుల కనుసన్నల్లో పని చేసిన అధికారులు ప్రస్తుతం పవర్‌లోకి వచ్చిన నాయకులను, వారి సన్నిహితులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో భారీ స్థాయిలో జరగనుండటంతోనూ ఇవి ముమ్మరంగా సాగుతున్నాయి. 

ఆ మరకలు తుడిచేసుకోవడానికి..
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా పని చేశారని, ప్రతిపక్షాలను ప్రత్యేకించి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, అనుచరులను ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు రేవంత్‌రెడ్డే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారుల్లో కొందరు పదవీ విరమణ చేయడం, పొడగింపులో ఉన్న ఇంకొందరు రాజీనామాలు సమర్పించడం జరిగాయి. ఇక మిగిలిన వారితో పాటు అవకాశాన్ని బట్టి ఎటైనా మారగల వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు, కీలక అనుచరులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని కలవడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా తమపై ఉన్న అభిప్రాయం బలపడటంతో పాటు మరింత దూరం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. సాంకేతిక కారణాలు, ఈసీ నిబంధనల నేపథ్యంలో సోమవారం వరకు కాస్త నెమ్మదించారు.

కోడ్‌ ముగియడంతో..
ఎన్నిలక నేపథ్యంలో షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి కోడ్‌ అమలులోకి వచ్చింది. పోలింగ్‌, కౌంటింగ్‌ ముగిసినప్పటికీ సోమవారం వరకు అమలులో ఉంది. దీన్ని పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లు సంజయ్‌ కుమార్‌ జైన్‌, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆయా అధికారులు రెండు రోజుల పాటు మిన్నకుండిపోయారు. బయటపడకుండా ఫోన్ల ద్వారానే ప్రసన్నానికి ప్రయత్నాలు చేశారు. సోమవారంతో ఎన్నికల కోడ్‌ ముగిసిపోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అభినందనలు చెప్పే సాకుతో వారిని కలుస్తూ, పుష్పగుచ్ఛాలు అందిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఎన్నికల్లో మీ పార్టీ గెలవడానికి, అభ్యర్థుల కోసం రిస్క్‌ తీసుకుని, బయటపడకుండా అనేక సహాయసహకారాలు అందించినట్లు చెప్పుకుంటున్నారు.

► అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు పెద్ద ఎత్తున పదోన్నతుల నేపథ్యంలో కొందరు కమిషనరేట్లు, జిల్లాలు దాటాల్సి వచ్చింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ బదిలీలు అనివార్యమైనప్పటికీ ఈసారి ఇవి గతంకంటే భారీగా జరగనున్నాయి. దీంతో సుదీర్ఘకాలంలో అప్రాధాన్య పోస్టి ంగ్స్‌లో ఉన్న వారితో పాటు ఆశావహులు సైతం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టారు.

► ఇలా వారిని కలుస్తున్న ప్రతి అధికారీ నేను మీ వాడినేనని, ఇన్నాళ్లూ బయటపడలేకపోయానని, ఉన్నతాధికారుల ఒత్తిడితో మిన్నకుండిపోయానని.. ఇలా అనేక రకాలుగా సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. కొందరైతే తాము పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించే బ్యూరోక్రాట్లమని, ఎవరి ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుందని నేతల వద్ద వాపోతున్నారు. ఇలా బయటకు రాలేని, వచ్చినా అధికార పార్టీ వారు పట్టించుకోరని భావిస్తున్న కొందరు అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దో? అనే భావనలో వారు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement