ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

1 Oct, 2023 17:41 IST|Sakshi

ప్రధాని మోదీకి కేటీఆర్‌ కౌంటర్‌

కేసీఆర్‌ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం

చందర్‌ను గెలిపిస్తే రామగుండాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ ఉ‍న్నారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ సభలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. పాలమూరులో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌కు కేటీఆర్‌ కౌంటరిచ్చారు. 

బీఆర్‌ఎస్‌ సభలో​ కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రధానికి ప్రేమ లేదు. మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వచ్చారు?. వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా?. మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కవు. దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. మేము ఇచ్చినట్టు రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వండి. గుజరాత్‌ బుద్ధి మాకు నేర్పకండి. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?. ప్రధానికి స్పీచ్‌ ఎవరు రాస్తున్నారో​ తెలియదు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌ మోసం అంటూ మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ కుటుంబ సభ్యుడే అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌కు కౌంటర్‌..
ఇదే సమయంలో తెలంగాణకు మళ్లీ కేసీఆర్‌ సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ దొందు దొందే. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించండి. పెద్దపల్లిని ఒక జిల్లా కేంద్రంగా మార్చాం. కాంగ్రెస్‌ హయాంలో ఎప్పుడూ రూ.200 దాటి పెన్షన్‌ ఇవ్వలేదు. తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నీళ్ల కోసం ఎప్పుడూ గొడవలే జరిగేవి. కరెంట్‌ కోసం గతంలో ఎన్నో తిప్పలు ఉండేవి. 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్‌ నేతలకు నేను సవాల్‌ చేస్తున్నాను. మేమే బస్సులు పెడతాం.. ఎక్కడికైనా వచ్చి చూసుకోండి. కాంగ్రెస్‌ నేతలు వచ్చి కరెంట్‌ తీగలు పట్టుకోమని కోరుతున్నా. ఆరు గ్యారెంటీలు అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి వారెంటీ ఉందా?. వారెంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారెంటీని నమ్ముదామా?. రైతులను ఏరోజైనా కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకుందా?. 

కేసీఆర్‌ అంటే అమ్మకం.. మోదీ అంటే అమ్మకం..
అంతకుముందు కేటీఆర్‌ రామగుండంలో మాట్లాడుతూ.. మరోసారి ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే రామగుండంను నేను దత్తత తీసుకుంటాను. కానీ, భారీ మెజారిటీ రావాలన్నదే నా కండీషన్‌. తెలంగాణ సాధనలో ఆర్టీసీతో పాటు.. సింగరేణి కార్మికులది కీలకపాత్ర. నవరత్నాలు, మహారత్నాలకు ధీటుగా సింగరేణి రికార్డులను బద్ధలు కొడుతోంది. నాడు 419 కోట్లు లాభాలుంటే... నేడు 2,222 కోట్ల లాభాల్లో ఉంది సింగరేణి. కార్మికులకు ఆ లాభాల్లో వాటా 32 శాతం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం’ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణకు మోదీ వరాలు..  ఫుల్‌ జోష్‌లో బీజేపీ కేడర్‌

మరిన్ని వార్తలు