జైళ్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

1 Dec, 2022 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. సీబీఐ, ఈడీతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ వచ్చి ప్రశ్నలడిగితే కచ్చితంగా సమాధానం చెబుతామని తెలిపారు. సీబీఐ.. ఈడీ అన్నింటిని ఎదుర్కొంటామని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఈడీ వచ్చిందని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

బీజేపీ చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తోంది. మీడియాకు లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని చూస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలి కానీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. కాదు కూడదని కేసులు పెడతామంటే పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. దేనికైనా భయపడేది లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం. జైళ్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?’  అని కవిత ఫైర్‌ అయ్యారు.
చదవండి: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ రంగనాథ్‌ బదిలీ..

మరిన్ని వార్తలు