అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత

15 Nov, 2023 10:38 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వార్తా సంస్థతో తన పర్సనల్‌, పొలిటికల్‌ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


మీరు ప్రతిసారి చీరనే ఎందుకు ధరిస్తారన్న ప్రశ్నకు కవిత క్లారిటీ ఇచ్చారు. ‘పొలిటీషియన్‌గా ఉన్న నేను ఒక పద్ధతి ప్రకారం దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు నన్ను తమలో ఒకరిగా భావించాలంటే వారిలాగే నేనూ ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వారు నన్ను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. డిఫరెంట్‌ స్టైల్‌లో నా డ్రెస్సింగ్‌ ఉంటే వారు నా వద్దకు ఎందుకు వస్తారు’ అని కవిత సమాధానమిచ్చారు.

ఇక లిక్కర్‌ స్కామ్‌లో విచారణ గురించి అడగ్గా ‘మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. దర్యాప్తు సంస్థలు నాకు సమన్లు పంపించినపుడు మా ఇంట్లో వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ఒక కుటుంబ సభ్యురాలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వారికి చాలా కష్టంగా ఉంటుంది’ అని కవిత చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తనకు ఇష్టమైన పొలిటీషియన్లని వారి నుంచి నేర్చుకొని రాజకీయ నేతగా ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.    

ఇదీ చదవండి..అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం 

మరిన్ని వార్తలు