స్వేచ్ఛ లేదు.. ప్రశ్నిస్తే అరెస్టులు.. దుర్మార్గమైన చర్య: ధర్నా చౌక్‌ నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి

22 Dec, 2023 13:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నియంతృత్వ పోకడ పాలన నడుస్తోందని.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలంగాణ  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్‌ పరిణామంతో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కార్యక్రమం నిర్వహించింది. 

‘‘దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. నియంతృత్వ పోకడలతో మోదీ పాలన నడుస్తోంది. దేశంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అంతా రోడ్డెక్కారు’’ అని అన్నారాయన. ఈ నిరసనలో షబ్బీర్‌ అలీతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘సమాధానం చెప్పే ధైర్యం లేక ఎంపీ లను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య స్పూర్తి కి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తే.. కాంగ్రెస్ కోర్టుకు పోయి కొట్లాడింది. నియంతృత్వ పోకడలతో వెల్లినందుకే బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారు. బీజేపీ కి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.


మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ కే రక్షణ లేదు దేశానికి రక్షణ ఉంటుందా?. పార్లమెంట్ పై దాడి గురించి ప్రశ్నిస్తే..సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి?. ఎంపీ లకు ప్రశ్నించే హక్కు లేదా?. దేశ ప్రజలంతా ఇండియా కూటమి కి మద్దతు గా నిలవాలి’’.


మరోవైపు.. మోదీ ప్రభుత్వ విధానాలపై ఇండియా కూటమి నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ భద్రతా విఘాతంపై  హోంశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాల పట్టుబట్టాయి. దీంతో 146 మంది ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. అదే సమయంలో కీలకమైన మూడు నేర చట్టాలకు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం లభించింది. అయితే.. ప్రతిపక్షం లేకుండా బిల్లుల ఆమోదాన్ని విపక్ష కూటమి తీవ్రంగా ఖండిస్తోంది. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ.. సస్పెండ్‌ అయిన ఇతర ఎంపీలు పాల్గొన్నారు.  పార్లమెంట్‌ భద్రతను గాలికొదిలేశారని రాహుల్‌ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగ  కల్పన లేదు కాబట్టే సెల్‌ఫోన్‌లలో యువత గంటలు గంటలు గడుపుతోందని అభిప్రాయపడ్డారాయన. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారాయన.

ఇదీ చదవండి: సగానికిపైగా అప్పులు తీర్చాం

>
మరిన్ని వార్తలు