ఆ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ వైపు మొగ్గు!

7 Sep, 2022 16:57 IST|Sakshi

ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడం మామూలే. తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు నేతలు అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సొంత నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతుండడం రాజకీయ వేడిని పెంచుతోంది. 

ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీకి పోటీ చేసినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ విజయ దుందుభి మోగించారు. అలాగే హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌ ఆదేశాల మేరకు నల్లగొండ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని  పరీక్షించుకోవాలని డిసైడ్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొడంగల్‌ నుంచి పోటీ చేసి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో.. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డిని పోటీకి దించడంతో పాటు మంత్రి హరీష్‌రావు కొడంగల్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టడంతో... రేవంత్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీచేసిన రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌ నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ కొడంగల్‌ కాకుంటే తన స్వగ్రామం ఉన్న కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే తేరుకుని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పేరుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ అయినా ఆయన దృష్టంతా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అటు నల్లగొండ నుంచి ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అసెంబ్లీకే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌ గెలిచినా ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక అవినార్యమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతిని పోటీకి పెట్టినా ఓటమి తప్పలేదు. అక్కడ కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని వదిలిపెట్టి మళ్లీ ఎమ్మెల్యేగానే అదృష్టం పరీక్షించుకోవాలని ఉత్తమ్‌ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని ఎత్తుకు పైఎత్తు వేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌ క్షేత్ర స్థాయిలో బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుండడం.. రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్న కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌ అయ్యే అవకాశముందనే చర్చ జరుగుతుతోంది. అలాంటి పరిస్థితి వస్తే పెద్ద పదవి లభించే అవకాశం లేకపోలేదని ముగ్గురు సీనియర్‌ నేతలు భావిస్తున్నారట. అందుకే అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అనూహ్య రాజకీయ పరిణామాలేమైనా సంభవిస్తే తప్ప ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు అసెంబ్లీకే పోటీ చేస్తారంటున్నారు.

మరిన్ని వార్తలు