టీడీపీ శవరాజకీయాలు

17 Aug, 2021 03:50 IST|Sakshi
పోలీసులతో వాగ్వాదం చేస్తున్న  నారా లోకేష్‌

లోకేశ్‌ వచ్చే వరకు రమ్య మృతదేహాన్ని తరలించవద్దంటూ టీడీపీ ఆందోళన  

అంబులెన్సుకు దారివ్వాలన్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి యత్నం  

మృతురాలి ఇంటి వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం 

పలువురు పోలీసులకు స్వల్ప గాయాలు 

లోకేశ్‌ సహా టీడీపీ నేతల అరెస్టు

సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్‌: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గుంటూరులో ఆదివారం హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి సోమవారం ఉదయం పంచనామా పూర్తయింది. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ, మేయర్‌ మనోహర్‌నాయుడు, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ లాలుపురం రాము తదితరులు రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ మంత్రి లోకేశ్‌ వస్తున్నారని, ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని టీడీపీ నేతలు ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, నసీర్‌ అహ్మద్, కార్యకర్తలు అంబులెన్సు ముందు బైఠాయించారు. వారించిన పోలీసులపై తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట ఎస్‌ఐ నరసింహపై దాడిచేశారు. అంబులెన్స్‌కు దారిచూపే ప్రయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. 


జీజీహెచ్‌ నుంచి రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్సును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

అక్కడా అంతే.. 
మృతురాలి ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే రీతిన ప్రవర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, ఆలపాటి రాజా, ఆనంద్‌బాబు మృతురాలి ఇంటి ముందు నిలబడి నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను లోకేశ్‌ బృందం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని పేర్కొన్నారు. రమ్య ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించటమేగాక పోలీసు విధులకు ఆటంకం కలిగించిన లోకేశ్, మరో 32 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అర్బన్, రూరల్‌ ఎస్పీలు ఆరీఫ్‌ హఫీజ్, విశాల్‌ గున్నీ అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. లోకేశ్‌ను విడుదల చేయాలంటూ టీడీపీ వారు ప్రత్తిపాడులో రోడ్డుపై బైఠాయించి ఎస్‌ఐ అశోక్‌తో వాగ్వాదానికి దిగి కవ్వించారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్‌ సీఐ వాసు సోమవారం రాత్రి లోకేశ్‌తో పెదకాకాని పోలీసుస్టేషన్‌ వద్ద సంతకం చేయించుకుని పంపించారు.  

రూ.కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు 
గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి సోమవారం విడుదల చేసిన ఒక  ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో రమ్య హత్య జరుగుతుంటే దిశ యాప్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గుంటూరు నడిబొడ్డునే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే సీఎం జగన్‌కి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు