వామ్మో చినబాబు.. ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది..!

30 Oct, 2022 15:11 IST|Sakshi

సహజంగా రాజకీయ నాయకులు పదవులిస్తామంటే ఎగిరి గంతేస్తారు. కాని పచ్చ పార్టీలో అనుబంధ సంఘాల పదవులిస్తామంటే పారిపోతున్నారట. ఆరు నెలలుగా కమిటీలను నియమించలేక ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ఆ పార్టీ యువనేతకు పిచ్చెక్కుతోందట. దీంతో ఫ్రస్టేషన్ ఎక్కువైపోయి పార్టీ నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారాట యువనేత. ఆ ఫ్రస్టేషన్ లీడర్ ఎవరో మీరే చదవండి.

ఆ ఆదేశానికి ఆరు నెలలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట రోజు రోజుకూ పాతాళంలోకి పడిపోతోంది. ఎవరెంత కష్టపడుతున్నా పైకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాల బాధ్యతలు తీసుకోవడానికి నాయకులెవరూ ముందుకు రావడంలేదట. టీడీపీకి అనుబంధంగా తెలుగుయువత, తెలుగుమహిళ, తెలుగు విద్యార్థి సహా వివిధ రంగాలకు సంబంధించి మొత్తం  19 విభాగాలున్నాయి. ఈ అన్ని విభాగాలకు అధ్యక్షులున్నారు. కాగా...అన్నిటికి కామన్‌గా యువనేత నారా లోకేష్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు వాటి అనుబంధ విభాగాల కమిటీలను వేయించాల్సింది కూడా ఆయనే. పార్టీ మహానాడు పూర్తియిన వెంటనే అనుబంధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలను వేయాలని వాటి అధ్యక్షులను ఆదేశించారు చినబాబు. మహానాడు ముగిసి ఆరు నెలలు గడిచినా కమిటీల ఏర్పాటు ఇంకా  పూర్తి కాలేదు. దీంతో చినబాబు ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారట.

కథలు వద్దు.. అమలు కావాలట.!
ఒక్కొక్క కమిటీలో 15 నుండి 20 మంది వరకు నాయకులను వేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కమిటీల పర్యవేక్షణ కోసం ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నజీర్, గౌతు శిరీష, దువ్వారపు రామారావులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కమిటీలు వేయమనిచెప్పి ఆరు నెలలు గడుస్తున్నా..పూర్తి కాకపోవడంతో నారా లోకేష్‌లో అసహనం పెరిగిపోతోంది. దీంతో ప్రతి మంగళవారం  అనుబంధ సంఘాల రాష్ట్ర నేతలు, పర్యవేక్షణ కమిటీ నేతలలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారిపై నోరు పారేసుకుంటున్నారట.  మీరు నాకు కథలు చెప్పకండి, చేతకాకపోతే చెప్పండి వేరే వారిని అనుబంధ సంఘాల అధ్యక్షులుగా పెట్టుకుంటానంటూ హెచ్చరిస్తున్నారని వారు వాపోతున్నారు. నెలనెలా జీతాలు తీసుకుంటారు గాని పార్టీ కోసం పని చేయరా అంటూ అనుబంధ సంఘాల అధ్యక్షులను లోకేష్ హెచ్చరిస్తున్నారని పచ్చపార్టీ ఆఫీస్‌లో టాక్‌. 

ఉంటే ఉండండి.. పోతే పోండి.!
తాము పిలిచి పదవులు ఇస్తామంటున్నా అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకోవడానికి పార్టీ నేతలు ఎవరూ ముందుకు రావడంలేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ మీద పార్టీ శ్రేణులకు నమ్మకం లేనందువల్లే ఎవరూ పదవులు తీసుకోవడానికి సిద్ధపడటంలేదని చెబుతున్నారు. సాధారణంగా పదవులు ఇవ్వకపోతే ఏ పార్టీలో అయినా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కాని టీడీపీలో పదవులు ఇస్తామంటే పారిపోతున్నారని వాపోతున్నారు. ఆరు నెలల నుంచి పార్టీ పదవులు ఇస్తామని చెప్తున్నా ఎవరూ ముందుకు రాకపోతే తామేం చేస్తామని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నామని, కేసులు కూడా భరిస్తున్నామని, తమ సేవలను గుర్తించకుండా.. పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి అనే రీతిలో లోకేష్‌ చులకనగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ తమకు తలనొప్పిగా మారిందని.. లోకేష్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నామని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ రోజు రోజుకూ క్షీణించడం, అనుకున్న స్థాయిలో సభ్యత్వం నమోదు కాకపోవడంతో ఆ కోపాన్ని తమ మీద చూపిస్తే...మేమేం చేస్తామని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు