మరణావస్థలో కాంగ్రెస్‌!: సిద్ధూ

9 Oct, 2021 04:29 IST|Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్‌ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్‌ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్‌ సింగ్‌ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్‌ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్‌ పంజాబ్‌ సీడబ్లు్యసీ చీఫ్‌ సుఖ్విందర్‌ సింగ్‌ సముదాయించడం వీడియోలో కనిపించింది.

వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్‌ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్‌  విమర్శించింది.

కాంగ్రెస్‌ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్‌ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్‌ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ– కాంగ్రెస్‌) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్‌ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని  వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు.  తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్‌ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు