సీన్‌ రివర్స్.. చంద్రబాబుకు వార్నింగ్‌.. అలా చేయకపోతే తోకలు కత్తిరిస్తాం..

22 Aug, 2023 19:00 IST|Sakshi

తోకలు కత్తిరిస్తానంటూ అందరినీ బెదిరించడం చంద్రబాబుకు బాగా అలవాటు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పచ్చ పార్టీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. తమ ఇన్‌చార్జ్‌ను మార్చకపోతే మేమే తోకలు కత్తిరిస్తామంటూ అక్కడి నాయకులు చంద్రబాబుకే వార్నింగ్‌ ఇచ్చారట. బయటినుంచి తమ మీద పెత్తనం చేస్తున్న వ్యక్తికి కాకుండా లోకల్‌ లీడర్‌కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట. 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే టీడీపీ బాస్ చంద్రబాబుకు ఏలూరు జిల్లా నూజివీడు తమ్ముళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ సీటు  స్థానికులకే ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం నూజివీడు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్టీలోను.. ఇటు ప్రజల్లోనూ ఆదరణ లేక ఓటమిని తనఖాతాలో వేసుకోవాల్సివచ్చిందని టాక్.

రెండుసార్లు ఓడిపోయిన నేత మూడోసారైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉండగా.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌ను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పట్నుంచో నూజివీడు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారట.

ముఖ్యంగా నూజివీడు పార్టీలో సీనియర్ నేత కాపా శ్రీనివాసరావుకు.. ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో కాపా వర్గాన్ని ముద్రబోయిన తరచూ టార్గెట్ చేస్తున్నారట. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా కాపా శ్రీనివాసారావు వర్గం పాదయాత్ర చేపట్టింది. నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన లేకుండానే పాదయాత్ర చేపట్టినందుకు కాపా వర్గానికి చెందిన నూజివీడు మండల నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో కాపా శ్రీనివాసరావు వర్గం ముద్రబోయినపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

కాపా వర్గం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి నేరుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పంచాయతీ పెట్టిందట. ఆ సమయంలో చంద్రబాబు తన సహజధోరణితో.. మీ సంగతి చూస్తా...అంతు తేలుస్తా..అంటూ హెచ్చరించడంతో వెళ్లినవారంతా షాక్ తిన్నారట. సమస్య చెప్పుకోవడానికి వెళితే బెదిరిస్తారా అంటూ రగిలిపోతున్న కాపా వర్గం ముద్రబోయిన కావాలో తాము కావాలో తేల్చుకోవాలంటూ, అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేందుకు ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ విషయం తెలియగానే మొన్నటి వరకూ డోంట్ కేర్ అన్న అధిష్టానం బుజ్జగింపుల కోసం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుని రంగంలోకి దించింది. ఓ మూడు గంటలు పాటు బ్రతిమిలాడిన తర్వాత.. మూడు రోజులు గడువిస్తామని.. ఈలోగా తమ డిమాండ్లకు సానుకూల నిర్ణయాలు రాకపోతే..తమ నిర్ణయం ఏంటో ప్రకటిస్తామని కాపా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ పెట్టారట.
చదవండి: పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ షాక్‌

ఇదిలా ఉంటే నూజివీడు ఇన్‌చార్జ్‌గా అధిష్టానం ఎవరిని సూచించినా ఆ నేతకు మద్దతిస్తామని.. కానీ ఆ వ్యక్తి ముద్రబోయిన కాకుండా స్థానికుడే అయిఉండాలని పట్టుబడుతున్నారట కాపా వర్గం నేతలు. ఏ సామాజిక వర్గానికి చెందిన నేత అయినా స్థానికుడైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ముద్రబోయిన కాకుండా ఎవరైనా ఓకే అని స్పష్టం చేస్తున్నారట.

తమ డిమాండ్‌ను కాదని ముద్రబోయినకు టిక్కెట్టిస్తే మాత్రం తేడాలొచ్చేస్తాయనే బలమైన సంకేతాన్ని పంపించారట. ఇప్పుడు నూజివీడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పసుపు పార్టీలో తీవ్రస్థాయి చర్చకు దారితీసాయి. వారి డిమాండ్‌కు తలవొగ్గితే అన్ని చోట్ల నుంచి అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మరో రకంగా సమస్య వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యగానే కనిపిస్తోందంటూ చంద్రబాబు తల బాదుకుంటున్నారని టాక్‌.
 

మరిన్ని వార్తలు