వెంటనే వస్తే ప్రాధాన్యమిస్తాం! 

27 May, 2023 02:46 IST|Sakshi

చేరికలపై దూకుడు పెంచిన బీజేపీ.. ఆసక్తిగా ఉన్నవారికి ఆఫర్లు 

వివిధ పార్టీల నేతలతో టచ్‌లోకి చేరికల కమిటీ నాయకులు 

స్వయంగా భేటీలు.. సన్నిహితుల ద్వారా, ఫోన్లతో సంప్రదింపులు 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీలో చేరికల విషయంలో ఇకపై దూకుడుగా ముందుకు వెళ్లాలని, కసరత్తు వేగవంతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నవారు.. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే చేరితే ప్రాధాన్యమిస్తామని భరోసా కల్పించేందుకు సిద్ధమైంది.

ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున చేరికల అంకాన్ని త్వరగా ముగించి ఎన్నికల సన్నద్ధతపై దృష్టి పెట్టాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం, చేరికల కమిటీ అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలతో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఇతర నేతలు మరో విడత సంప్రదింపులు మొదలుపెట్టారు. 

కొనసాగిన ఈటల ఆపరేషన్‌! 
చేరికల ప్రక్రియలో భాగంగా ఈటల రాజేందర్‌ శుక్రవారం కూడా పలువురు నేతలను స్వయంగా కలుసుకోవడం, సన్నిహితుల ఫోన్ల ద్వారా మంతనాలు సాగించడం చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఉదయమే ఇంట్లో నుంచి బయలుదేరిన ఈటల.. తొలుత విద్యానగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో జరిపిన చర్చల సారాంశాన్ని, వారి నుంచి వచ్చిన స్పందనను ఆయనకు వివరించారు.  ఈటల తన వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్, గన్‌మన్లు లేకుండానే.. పలుచోట్లకు వెళ్లి ఇతర పార్టీల నేతలను కలిశారని, కొందరితో ఫోన్లలో సంప్రదింపులు జరిపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

కీలక నిర్ణయాలతో త్వరలోనే ఊపు? 
రాష్ట్ర పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని, కచ్చితంగా విజయం సా ధించేలా పార్టీలో జరుగుతాయని చెప్తున్నారు. ఆ మార్పుల తర్వాత చేరికల వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని, ఈ క్రమంలోనే బీజేపీలో చేరనున్న నేతలకు పలు అంశాలపై హామీలు ఇచ్చేందుకు ముఖ్య నేతలు సిద్ధపడినట్టు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు