Raipur: తొలిసారి.. ఇక్కడ పోలింగ్‌ భారమంతా మహిళలదే

18 Nov, 2023 09:57 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రాయ్‌పూర్‌ (నార్త్‌)లో పోలింగ్‌ ప్రక్రియ ఆసాంతం మహిళా అధికారులు, సిబ్బంది చేతులమీదుగానే నడిచింది. ప్రిసైడింగ్‌ అధికారి మొదలుకొని పోలింగ్‌ అధికారి వరకు మొత్తం 201 పోలింగ్‌ బూత్‌ల్లో మహిళలకు మాత్రమే బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.

‘సంగ్వారీ (ఉమెన్‌ ఫ్రెండ్లీ) బూత్‌లకు పూర్తిగా మహిళా అధికారులను నియమించాం. 804 మంది మహిళలకు ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించాం. మరో 200 మందిని రిజర్వులో ఉంచాం. ఇక్కడ ఐఏఎస్‌ అధికారి ఆర్‌.విమలను పరిశీలకురాలిగా నియమించాం. లయిజనింగ్‌ అధికారి కూడా మహిళే. చాలావరకు బూత్‌ల వద్ద భద్రతకు మహిళా సిబ్బందినే నియమించాం’అని వివరించింది. రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి మహిళా ఐఏఎస్‌ రీనా బాబా సాహెబ్‌ కంగాలె కావడం విశేషమని ఆ ప్రకటనలో వివరించింది.

మహిళా అధికారులే పోలింగ్‌ నిర్వహించిన రాయ్‌పూర్‌(నార్త్‌)నియోజకవర్గంలో స్త్రీ, పురుష నిష్పత్తి కూడా 1010:1000గా ఉండటం మరో విశేషమని పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే ఒక నియోజకవర్గంలో పోలింగ్‌ బాధ్యతలను కేవలం మహిళలకే అప్పగించాలన్న ఆలోచన రూపుదిద్దుకుందని రాయ్‌పూర్‌ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ సర్వేశ్వర్‌ నరేంద్ర భూరె తెలిపారు. ఈ మేరకు చేపట్టిన చర్యలు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ తమను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాయ్‌పూర్‌ సిటీ(సౌత్‌) నియోజకవర్గంలోని సగం వరకు బూత్‌ల్లోనూ మహిళా అధికారులనే నియమించినట్లు ఆయన వెల్లడించారు.  
చదవండి: వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు

మరిన్ని వార్తలు