ఇమ్రాన్‌ ఖాన్‌తో లాబీయింగ్‌ చేయించిన సిద్ధూ!.. మాజీ సీఎం సంచలన ఆరోపణ

24 Jan, 2022 19:29 IST|Sakshi

పంజాబ్‌ ఎన్నికల వేళ.. విమర్శలు-ప్రతివిమర్శలతో రాజకీయ ప్రచారాలు వాడీవేడిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌.. ఇవాళ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్నారు కూడా. తదనంతరం ప్రత్యర్థి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పై షాకింగ్‌ కామెంట్లు చేశారాయన.    


తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిద్ధూను కేబినెట్‌ నుంచి బయటికి పంపించేశాక.. ఒకరోజు ఆయనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందట.  అది పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తరపు నుంచి విజ్ఞప్తి. సిద్ధూను కేబినెట్‌లోకి తీసుకుంటే బాగుంటుందని, అతను తన పాత స్నేహితుడని, ఒకవేళ అతను గనుక సరిగా పని చేయకుంటే అప్పుడు తొలగించాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ తరపున రిక్వెస్ట్‌ అందిందట. సిద్ధూ ఆ స్థాయిలో లాబీయింగ్‌ జరిపాడని, కానీ, దానికి తాను స్పందించలేదని అమరీందర్‌ వెల్లడించారు. 

ఇదిలా ఉంటే కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆరోపణలు చేసిన కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన సిద్ధూ.. పై ఆరోపణలపై స్పందించేందుకు మాత్రం ఇష్టపడలేదు. సిద్ధూ-అమరీందర్‌ సింగ్‌ విభేధాల వల్లే పంజాబ్‌ రాజకీయంలో కిందటి ఏడాది కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ పీఎంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. అక్కడ ఆర్మీ ఛీఫ్‌ ఖ్వామర్‌ జావెద్‌ బజ్వాను సిద్ధూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంపై కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా.    

ఇదిలా ఉంటే అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, SAD సంయుక్త్‌లతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన బీజేపీ.. సోమవారం సీట్ల పంపకాలను ఖరారు చేసింది. మొత్తం 117 స్థానాల్లో.. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ 37, ఎస్‌ఏడీ సంయుక్త్‌ 15, బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. ఆదివారం 22 మందితో కూడిన తొలి జాబితాను అమరీందర్‌ సింగ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సంగతి ఏమోగానీ, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు ఎన్నికల్లో పోటాపోటీగా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి.  ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో పంజాబ్‌ పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మరిన్ని వార్తలు