వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుపు మాదే 

20 Sep, 2021 03:35 IST|Sakshi

చంద్రబాబు లేదా ఆయన కుటుంబంలో ఎవరు పోటీ చేసినా ఓడిస్తాం 

‘పరిషత్‌’ ఫలితాలు వైఎస్‌ జగన్‌ అద్భుత పాలనకు నిదర్శనం  

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

తిరుపతి మంగళం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనవిజయం సాధిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు లేదా ఆయన కుటుంబంలో ఎవరు పోటీ చేసినా తమదే విజయమన్నారు. ‘పరిషత్‌’ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారని తెలిపారు. తిరుపతిలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబులాగా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే తత్వం సీఎం వైఎస్‌ జగన్‌కు లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్‌ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక నాయకుడు ఆయన మాత్రమేనని ప్రశంసించారు.

రాష్ట్రంలో కరోనా సాకు చూపి స్థానిక ఎన్నికలను ఆపేందుకు చంద్రబాబు అప్పటి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌తో కలసి కుట్రపూరిత రాజకీయాలు చేశారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు. ఆదివారం వెలువడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. మహానేత వైఎస్సార్‌ పులిలాంటి జగన్‌ని కంటే.. చంద్రబాబు మాత్రం పప్పుసుద్దను కన్నాడని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి, నరేంద్ర మోదీలను అడ్డం పెట్టుకుని గెలిచారే తప్ప ప్రజల ఆదరణతో కాదని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ కుట్రలకు భయపడకుండా ఒంటరిగా పోటీ చేసి 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకున్నారని తెలిపారు. 2024లోనూ గెలుపు ఆయనదేనన్నారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్‌ కుమార్, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే నాయుడు, పార్టీ సీనియర్‌ నేత ఎంఆర్‌సీ రెడ్డి పాల్గొన్నారు. 

కోడలు సర్పంచ్‌.. అత్త ఎంపీటీసీ
గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో అత్తా కోడళ్లు ప్రజాప్రతినిధులయ్యారు. దుగ్గిరాలకు చెందిన బాణావత్‌ కుషీబాయి సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అత్త బాణావత్‌ దాల్వీబాయి ఎంపీటీసీగా గెలుపొందారు. ఇద్దరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే.

ఒక్క ఓటు.. మార్చింది ఫేటు
విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం–2 ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మఠం రాజులమ్మ సమీప బీజేపీ అభ్యర్థి పాడి విజయలక్ష్మిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజులమ్మకు 240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి విజయలక్ష్మికి 239 ఓట్లు లభించాయి. రీ కౌంటింగ్‌ అనంతరం రాజులమ్మ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీంద్రనా«థ్‌ ప్రకటించారు. 

ఇది ఆషామాషీ మెజార్టీ కాదు
వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాలెంకోట రత్నమ్మ 25,100 ఓట్ల భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థి మధులతపై విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రైల్వేకోడూరు అభ్యర్థికి దక్కింది. 
–సాక్షి నెట్‌వర్క్‌ 

మరిన్ని వార్తలు