ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే

28 Jan, 2021 04:50 IST|Sakshi

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుకోవడంలో రాజకీయం ఎక్కడుంది

నిమ్మగడ్డ టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టలేదు 

చంద్రబాబు టెలికాన్ఫరెన్సులో చెప్పినవే ఎస్‌ఈసీ వల్లె వేశారు 

మార్చి తరువాత టీడీపీలోకే నిమ్మగడ్డ రమేష్‌ 

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం పెంపొందాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడుందో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ చెప్పాలన్నారు. ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రశ్నలను సంధిస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. 

నిమ్మగడ్డకు కంగారెందుకు? 
► ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు జరగకూడదా? ఏకగ్రీవాలను అడ్డుకోవడమే మీ ఉద్దేశమా? రాష్ట్రంలోలో గ్రామీణ పాలన, సచివాలయ వ్యవస్థ, ఇళ్ల వద్దకే సంక్షేమ పాలనను ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కొనియాడుతుంటే ఎస్‌ఈసీని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 
► ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి ‘పంచాల’ పేరుతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టలేదు? అప్పటికే ఉన్న జీవోపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? 
► ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచనలు చేయడం దురదృష్టకరం. ఏకగ్రీవాలకు అస్కారం ఇవ్వరాదని బాబు టెలికాన్ఫరెన్సులో చెప్పిన మాటలనే ఎస్‌ఈసీ వల్లె వేశారు. 
► ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామన్నట్లు నిమ్మగడ్డ అనడం రాజకీయం కాదా? 
► ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు?  
► పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా ఏకగ్రీవాలు ఫలానా పార్టీకి అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?   
► పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలనేందుకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో, ఏ చట్టంలో అది పొందుపరిచారో నిమ్మగడ్డ వెల్లడించగలరా?  
► అధికారులతో ఎలాంటి సమస్యా లేదంటూనే.. తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవు అన్నట్లుగా కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా? 
► సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లకు ఎస్‌ఈసీ పంపిన 9 పేజీల అభిశంసన లేఖను తిరిగి ఎన్నికల కమిషన్‌కే పంపాలని నిర్ణయించాం. మార్చి 31 తరువాత నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి టీడీపీలో చేరి రాజకీయాలు  చేయాలనుకుంటున్నారు.  

ఎన్నికల కమిషనరే చట్టాలను ఉల్లంఘించారు
ఎన్నికల కమిషనర్‌ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌  చట్టం–1994 కి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందని రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌ 2 (34) ప్రకారం ఎన్నికల జాబితా తయారు చేయడం, దానిని ప్రచురించడానికి ఏ సంవత్సరంలో జాబితా సిద్ధం చేశారో ఆ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీ (క్వాలిఫైయింగ్‌ డేట్‌)గా గుర్తిస్తారని తెలిపారు. సెక్షన్‌ 11 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన అధికారి ఈ క్వాలిఫయింగ్‌ డేట్‌ను ఆధారంగా చేసుకుని పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తారని, ఈ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగిస్తూ 2000 ఆగస్టు 4న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీనినే ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.

నిబంధనలకు ఎస్‌ఈసీ తిలోదకాలు..
2019లో చట్టపరంగా ఈ ప్రక్రియను అనుసరించిన కమిషనర్‌ 2021 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సమయంలో ఎందుకు తిలోదకాలు ఇచ్చారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2021 జనవరి 1 క్వాలిఫైయింగ్‌ డేట్‌ ప్రకారం పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్‌ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పక్కన పెట్టడంతో ఎన్నికల చట్ట నిబంధనలను సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే ఉల్లంఘించినట్లు అవుతోందన్నారు. దీనికి ప్రభుత్వం, ఉద్యోగులను కారణంగా చూపడం సమంజసం కాదన్నారు.  

మరిన్ని వార్తలు