అయోధ్య రాముడిపై పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు  

24 Jan, 2021 08:49 IST|Sakshi

కరీంనగర్‌: ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి శనివారం కరీంనగర్‌లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజ్యాంగ రక్షణ సదస్సు’లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన మాట్లాడుతూ.. నిన్నమొన్నటి నుంచి చందాల దందా మొదలైందని, అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని, రానున్న రోజుల్లో జై భీమ్‌– జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందన్నారు. ‘అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్‌ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని అన్నారు.

అసలు రాముడు భారతదేశంలో పుట్టాడా.. నేపాల్‌లో పుట్టాడా.. జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉంది’అని వ్యాఖ్యానించారు. ఎంపీ బండి సంజయ్‌ ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి నిత్యం గుళ్లు, గోపురాలంటూ టీఆర్‌ఎస్‌ను విమర్శించడం తగదని అన్నారు. దళితులు హిందువులే అయితే ఆలయాల్లోకి ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న బీజేపీ నాయకుడు ఎస్‌. అజయ్‌వర్మ.. పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఎంపీ బండి సంజయ్‌పై విమర్శలు తగదని, ఇది రాజకీయ వేదిక కాదని అన్నారు.  

మరిన్ని వార్తలు