టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

4 Jan, 2022 05:31 IST|Sakshi

ఎన్టీఆర్‌ అంటే అందరికీ గౌరవమే

దుర్గి ఘటనను పూర్తిగా ఖండిస్తున్నాం

ఇలాంటి వారిని ప్రోత్సహించే ప్రసక్తే లేదు

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అంటే అందరికీ గౌరవమేనని, గుంటూరు జిల్లా దుర్గిలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై సోమవారం ఆయన స్పందిస్తూ.. జరిగిన ఘటనను వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నాయని చెప్పారు.

ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తోందని, ఆ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్‌ లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. వారి గౌరవార్థం విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా  ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ చిన్న ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.

ఈ ఘటనకు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌ విగ్రహాలను తీసి పక్కన పడేసిన సందర్భాలు ఎన్నోచూశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా ఎన్టీఆర్‌ను తాము గుర్తించి, గౌరవిస్తామని.. అయితే  1995లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన చంద్రబాబే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదన్నారు.  

మరిన్ని వార్తలు