మోదీ పర్యటన వేళ.. బీఆర్‌ఎస్‌ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’

7 Apr, 2023 21:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సెంటిమెంట్‌ నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్‌ఎస్‌. రెండు దఫాలు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని దక్కించుకున్న కె.చంద్రశేఖరరావు మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) కాస్తా బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) అయింది. ఇప్పటికే కేంద్రంతో పలు అంశాలపై విభేదిస్తూ వచ్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి అడుపెట్టడంతో మరింత దూకుడు పెంచారు.

ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను ఈడీ విచారించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో బండి సంజయ్‌ అరెస్టుతో రాజకీయంగా మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పర విమర్శలు, కేసులు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అటు సోషల్‌ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తుండటం ఒక ఎత్తయితే, వాల్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలతో సైతం వినూత్నంగా సెటైర్లు వేస్తుండటం గమనార్హం. 
(చదవండి: సికింద్రాబాద్‌-తిరుపతి ‘వందే భారత్‌’ రైలు ప్రత్యేకతలు, టికెట్‌ ధరలివే!)

ఇక ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌ వస్తుండటంతో బీఆర్‌ఎస్‌ మరో ప్రచార అస్త్రానికి తెరలేపింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫోటోలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కారు పార్టీ నేతలు. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ సెటైరికల్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ  ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
(చదవండి: కేసీఆర్‌ వస్తే మోదీ చేతులతో సన్మానం చేయిస్తా: బండి సంజయ్‌)

మరిన్ని వార్తలు