-

‘డబుల్‌ ఇంజన్‌’తోనే అభివృద్ధి

27 Nov, 2023 03:53 IST|Sakshi
నిర్మల్‌లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ

రాష్ట్రంలో తొలిసారి బీజేపీ సర్కారు ఏర్పాటుకానుంది 

నిర్మల్, తూప్రాన్‌ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల తీరు సామాజిక న్యాయానికి వ్యతిరేకం 

మత ప్రాతిపదికన ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తామనడం సిగ్గుచేటు 

పేదల గురించి ఆలోచించేది బీజేపీ ఒక్కటే.. 

ధరణిని రద్దు చేసి ‘మీభూమి’ తెస్తాం.. టర్మరిక్‌ సిటీగా నిజామాబాద్‌ 

నిర్మల్‌ కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటాం 

రాష్ట్రంలో మిల్క్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామీ 

బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి 

నిర్మల్‌/మెదక్‌: తెలంగాణలో మొదటిసారిగా బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుందని.. సకల జనులంతా బీజేపీ వెంటే ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పడితే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కేవలం కుటుంబ పార్టీలు అని, బీజేపీ మాత్రం నిరంతరం పేద ప్రజల గురించే ఆలోచిస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌ కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో, మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలలో ప్రధాని మోదీ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. నీళ్లు ఇవ్వలేదు. నియామకాలను పేపర్‌ లీకులు, వాయిదాలతోనే సరిపెట్టారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే నియామకాలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ తెలంగాణను లూటీ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కట్టర్‌ ఫ్రాడ్‌తో చేతులు కలిపి లిక్కర్‌ స్కామ్‌ చేశారు. లిక్కర్‌ స్కామ్‌ చేసిన బీఆర్‌ఎస్, కట్టర్‌ ఫ్రాడ్‌ నాయకులను ఎవరినీ వదలబోం. ఇందులో కేసీ ఆర్‌ కుటుంబ సభ్యులపై విచారణ జరుగుతోంది. అవినీతి నాయకులు జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఇది మోదీ గ్యారంటీ. 

దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు 
బీజేపీ ఫుడ్‌పార్క్, టెక్స్‌టైల్స్‌ పార్క్‌ వంటివి ఏర్పాటు చేస్తుంటే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మాత్రం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. మత ప్రాతిపదికన రాష్ట్రంలో ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ పేర్కొనడం రాజ్యాంగానికే ప్రమాదకరం. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు. పదేళ్లు సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌ నుంచే పాలన సాగించిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే పరిమితం చేయాలి. కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు బాధితులకు పరిహారం ఇవ్వకుండా నడిరోడ్డుపై వదిలేశారు. ఆ మల్లికార్జున స్వామి కూడా కేసీఆర్‌ను వదలడు. 

అసైన్డ్‌ భూములను లాక్కున్నారు 
తెలంగాణలో ధరణి పేరిట భూమాయ నడుస్తోంది. పేదల నుంచి అసైన్డ్‌ భూములను లాక్కున్నారు. మేం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం. మీభూమి పేరిట కొత్త పోర్టల్‌ తీసుకువస్తాం. డ్రోన్ల సాయంతో పారదర్శకంగా భూముల లెక్కలు తేలుస్తాం. కేసీఆర్‌ తెలంగాణకు దళితుడిని తొలి సీఎం చేస్తామని మాటిచ్చి ద్రోహం చేశారు. మేం ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తాం. మాదిగలకు సరైన న్యాయం చేస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. 

ఢిల్లీలో సుల్తాన్లు.. తెలంగాణలో రజాకార్లు.. 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్కటే. రెండూ కుటుంబ పాలన సాగిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ సుల్తాన్‌లను పెంచి పోషిస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ రజాకార్లను పెంచి పోషిస్తున్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటే. కాంగ్రెస్‌ బోఫోర్స్‌ మొదలు హెలికాప్టర్ల కొనుగోలు వరకు అవినీతిలో కూరుకుపోతే.. కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాల్లో 30శాతం కమీషన్లు లాగడమే. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటూ బీఆర్‌ఎస్‌కు వెళ్తుంది.  బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతోపాటు వాటి వెంట ఉన్న ఎంఐఎంను కూడా ఓడించాలి. 

అసమర్థ కాంగ్రెస్‌కు ప్రజలు చెక్‌పెట్టారు 
కేంద్రంలో కాంగ్రెస్‌ అసమర్థ పాలన కొనసాగించింది. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతో మంది అమాయకులు బలయ్యారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడి బీజేపీకి పట్టం కట్టారు. మేం సమర్థ పాలనతో దేశంలో శాంతి నెలకొల్పాం. ఉగ్రవాదులను మట్టి కరిపించాం. ఓటమి భయంతోనే రాహుల్‌గాంధీ యూపీలోని అమేథీ నుంచి కేరళకు పారిపోయారు. ఇక్కడ (గజ్వేల్‌) ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్‌ కూడా ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నారు..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 
 
నిజామాబాద్‌ను టర్మరిక్‌ సిటీ చేస్తాం 
బీజేపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో అంశాలను చేర్చింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.2.75 లక్షల కోట్లు జమచేశాం. నిజామాబాద్, నిర్మల్‌ తదితర జిల్లాల పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును తీసుకువచ్చాం. నిజామాబాద్‌ను టర్మరిక్‌ సిటీ చేస్తాం. ఆర్మూర్‌ పసుపునకు జియోట్యాగింగ్‌ తీసుకువస్తాం. కోవిడ్‌ తర్వాత ప్రపంచానికి పసుపు విలువ తెలిసి వచ్చింది.

రైతులు బాగా పండించి లాభాలు పొందాలి. బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్‌ కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటాం. తెలంగాణలో త్వరలో మిల్క్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్‌పై వ్యాట్‌ ఎత్తేశాం. అక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ ఎత్తివేసి ధరలు తగ్గేలా చూస్తాం. 
 
తెలుగులో మాట్లాడుతూ.. ఉత్సాహపరుస్తూ.. 
బహిరంగ సభల్లో ప్రసంగించిన సమయంలో పలుమార్లు ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సభికులను ప్రశ్నలు అడుగుతూ, ఉత్సాహపరిచారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులరా..’ అని సంబోధించడం ఆకట్టుకుంది. ఇక తెలుగులో మాట్లాడుతూ.. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని ఫామ్‌హౌస్‌ సీఎం అవసరమా? ఇలాంటి సీఎంను తీసేయాలా వద్దా?’.. ‘తెలంగాణలో మొదటిసారి బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుంది’.. ‘పెట్రోల్‌ ధరలు తగ్గాలా.. వద్దా..?’ అని సభికులను ప్రశ్నించారు. ఇక మోదీ హిందీలో ప్రసంగించినప్పుడు దానిని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలుగులో అనువదించారు. 
 
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత 
– యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: మోదీ 
నందిగామ:  సమాజంలోని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని.. ధ్యానంతో మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని ప్రధాని మోదీ సూచించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలోని ధ్యాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్‌ వ్యవస్థాపకుడు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోదీ అనురాధా నక్షత్రానికి సంబంధించిన ‘బాకుల’ అనే మొక్కను నాటారు. గురూజీ కమ్లేష్‌ పటేల్‌తో కలసి ధ్యానం చేశారు. అనంతరం మాట్లాడారు.

ఒకే సమయంలో లక్ష మంది ధ్యానం చేయగలిగేలా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. యోగా, ధ్యానం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, ప్రశాంతతని ఇస్తాయన్నారు. యువత చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మోదీ కోరారు. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హాని చేయడమే కాకుండా బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. 

మరిన్ని వార్తలు