Telangana Election Results 2023: ఫలితాలపై విస్మయం..

4 Dec, 2023 05:45 IST|Sakshi

ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతల ఓటమిపై బీజేపీ అధిష్టానం షాక్‌

గ్రామీణంలో దక్కిన పట్టు, 8 స్థానాల్లో గెలుపుపై హర్షం

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీతో జేపీ నడ్డా, అమిత్‌ షా సమీక్ష   

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. 

ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్‌ షా సమీక్ష 
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్‌ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్‌ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్‌ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్‌కు గురిచేసింది.

అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్‌పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్‌లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్‌ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్‌ హైదరాబాద్‌లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం 
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు