చంద్రబాబుకు కొత్త ట్విస్ట్‌.. పార్టీ నేతనే ఓడిస్తానని సవాల్‌!

17 Jul, 2023 12:49 IST|Sakshi

పాతాళంలో ఉన్న టీడీపీని పైకి తెద్దామని సింహపురి నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. అష్టకష్టాలు పడి కేడర్‌ను దారిలోకి తెచ్చుకున్నారు. అంతా బాగుందని అనుకుంటుంటే..మాజీ మంత్రి ఒకరు ఎంట్రీ ఇచ్చారు. ఈ సిటీ సీటు నాదే అంటున్నారు. పచ్చ పార్టీ బాస్‌ కూడా ఆ మాజీ మంత్రితో ఉన్న బంధం కారణంగా ఆయనేకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అప్పటిదాకా కష్టపడ్డ నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి?..

నెల్లూరు టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం.. పాదయాత్రలో లోకేష్ నుంచి సరైన హామీ రాకపోవడంతో వారు లోలోన మదనపడుతున్నారు.  నెల్లూరు సిటీ, రూరల్ పరిస్థితి పచ్చ పార్టీకి తలనొప్పిగా మారింది. సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ రీ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి దాకా ఇన్చార్జిగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం పక్కన పెట్టేసింది. రాష్ట ప్రధాన కార్యదర్శి అంటూ నామమాత్రపు పదవి అప్పగించింది. లోకేష్ పాదయాత్రలో కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో శ్రీనివాసులురెడ్డి పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. నాలుగేళ్ల నుంచి పార్టీ కార్యక్రమలకు భారీగా ఖర్చు చేశానని ఇప్పుడు నారాయణ మళ్ళీ వచ్చాడని తనను పక్కకు తప్పిస్తారా అంటూ మండిపడుతున్నారు. 

మాజీ మంత్రి నారాయణ ఎంట్రీ..
పార్టీ ఓడిపోయాక మాజీ మంత్రి నారాయణ సిటీ పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు సిటీలో బలమైన నేతగా ఉన్న వైఎస్‌ఆర్‌సీ ఎమ్మెల్యే అనిల్‌ను ఎదుర్కొనడం నారాయణకు సాధ్యం కాదని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అంటున్నారు. అనిల్‌కు ఎదురు నిలబడి ఇప్పటివరకు  పార్టీని కాపాడితే తనను పక్కనపెట్టారని.. తన సహకారం లేకుండా సిటీలో నారాయణ గెలుపు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని అనుచరుల వద్ద కోటంరెడ్డి చెబుతున్నారంటూ పార్టీలో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన బ్యాచ్‌ను వేసుకుని నారాయణ రాజకీయం చేస్తున్నారని.. ఇదే జరిగితే.. ఆయన మరోసారి ఓడిపోవడం ఖాయమని సిటీ నేతలు చెబుతున్నారు. కోటంరెడ్డి అసంతృఫ్తిని గమనించిన నారాయణ.. ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. తనను గెలిపిస్తే.. ఎమ్మెల్సీ ఇప్పిస్తాననని.. చంద్రబాబు ద్వారానే హామీ ఇప్పిస్తానని చెబుతున్నారట.

జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ సీరియస్‌..
ఇక మాజీ మంత్రి నారాయణ వ్యవహార శైలిపై జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ కూడా సీరియస్‌గా ఉన్నారట. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి నారాయణ తన గొంతు కోశారని అనుచరుల వద్ద రూరల్ సీటు ఆశిస్తున్న అజీజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే ముందు కూడా కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నారాయణ వెన్నుపోటు పొడిచాడని మండిపడుతున్నారట. నెల్లూరు సిటీ, రూరల్‌లో తనకు ఉన్న ఓటు బ్యాంక్‌తో నారాయణను, కోటంరెడ్డిని ఓడిస్తానని అజీజ్ శపథం చేశారట. 

నాలుగేళ్ళ పాటు పార్టీని, కేడర్‌ను పట్టించుకోని మాజీ మంత్రి నారాయణను ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకులే అంటున్నారు. పైగా నారాయణ వెంట కేడర్ ఎవరూ లేరని, అదే సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అజీజ్‌లు అసంతృప్తితో ఉన్నందున నారాయణకు మళ్ళీ ఓటమి తప్పదని విస్పష్టంగా చెబుతున్నారు తెలుగుతమ్ముళ్ళు. అయినా టీడీపీ నాయకుల పిచ్చి గాని...కోట్లు కుమ్మరించేవారకి కాకుండా..వేరేవారిని చంద్రబాబు ప్రోత్సహించడని వారికి తెలియదా? ఇప్పుడైనా తెలుసుకోండని అంటున్నారు అక్కడి ప్రజలు.

ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు