Punjab Assembly Election 2022: పంజాబ్‌ ఎన్నికల్లో అందరిదీ సేఫ్‌ గేమే!..

23 Jan, 2022 11:08 IST|Sakshi

వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్‌గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, ప్రస్తుత ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ సహా అనేకమంది బాదల్‌ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  

ఎవరు ఎక్కడి నుంచి.. 
నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ: కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన పాత సీటు అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్‌ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు.  


 
బిక్రమ్‌ మజీఠియా: మజీఠా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్‌ యువనేత అయిన బిక్రమ్‌ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్‌ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్‌ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు.  


 
చరణ్‌జిత్‌ చన్నీ: చమ్‌కౌర్‌ సాహిబ్‌ స్థానం నుంచి సీఎం చరణ్‌జిత్‌ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. 

చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్‌)

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌: కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పాటియాలా అర్బన్‌ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్‌ అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది.  

సుఖ్‌బీర్‌ బాదల్‌: అకాలీదళ్‌–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్‌బీర్‌ బాదల్‌ ఈసారి కూడా జలాలాబాద్‌ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ 2017 ఎన్నికల్లో సుఖ్‌బీర్‌ బాదల్‌పై పోటీ చేసి ఓడిపోయారు.  

భగవంత్‌ మాన్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్‌ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దల్బీర్‌ గోల్డీ, అకాలీదళ్‌ నుంచి ప్రకాశ్‌ చంద్‌ గార్గ్‌లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి.      


– సాక్షి, న్యూఢిల్లీ 

>
మరిన్ని వార్తలు