కేసీఆర్‌ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి

22 Oct, 2023 04:38 IST|Sakshi

ప్రజాసంఘాల పోరాటాలకు ఎన్నికల కోడ్‌ అడ్డుకాదు: ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అంతమైతేనే తప్ప తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ‘తెలంగాణ సమాఖ్య – ప్రజా సంఘాల ఉమ్మడి మేనిఫెస్టో’ను జస్టిస్‌ చంద్రకుమార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో అప్పులు చేశారని, ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ ప్రజా సంఘాల పోరాటాలకు అడ్డంకి కాదని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఏకమై కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ...బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరూప్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రవళిరెడ్డి, శ్యామల శ్రీను, హర్షవర్షన్‌ రెడ్డి, తెలంగాణ సమాఖ్య కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు