కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ అతిపెద్ద స్కాం: రాహుల్‌

1 Nov, 2023 20:49 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని అవినీతి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బుధవారం  షాద్‌నగర్ పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామన్నారు. కంప్యూటరైజేషన్‌ పేరుతో ధరణిలో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2500 జమ చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500తో పాటు 500కే సిలిండర్ వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సు చార్జీలకే రూ. 1000-1500 ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల బాధలను తగ్గించేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై 24 కేసులు పెట్టాయని, వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తే.. నేను మాత్రం దేశాన్ని కలిపి ఉంచాలని చూస్తానన్నారు. ధరణితో 25 లక్షల మంది రైతుల భూములను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో కులగణన జరగాల్సిందేనని.. ఓబీసీలకు అధికారాన్ని ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్‌లు నిరాకరిస్తున్నాయని.. అందుకే బీసీ కులగణనకు ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతామని ప్రకటించారు. అదే విధంగా కేంద్రంలో అధికారం చేపట్టగానే హిందూస్థాన్ అంతా కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.
చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు