-

రాహుల్ గాంధీకి వాళ్లతో లింకులు.. విదేశాలకు వెళ్లి కలుస్తారు.. ఆజాద్ సంచలన ఆరోపణలు..

10 Apr, 2023 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. రాహుల్ విదేశాలకు వెళ్లి కలవకూడని వ్యాపారవేత్తలను కలుస్తారని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. దీన్నే అవకాశంగా అందిపుచ్చుకున్న బీజేపీ.. రాహుల్ విదేశాల్లో కలిసిన ఆ వ్యాపారవేత్తలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. వాళ్లను ఎందుకో కలిశారో కూడా వివరణ ఇవ్వాలని నిలదీసింది.

హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తిన ఆయన మోదీ, అదానీ విమానంలో కలిసి ప్రయాణించిన ఫొటోను కూడా సభలో ప్రదర్శించారు.

అయితే రెండు రోజుల క్రితం అదానీ కంపెనీలకు చెందిన రూ.20వేల కోట్ల బినామీ డబ్బు ఎవరిదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజాన్ని దాస్తూ బీజేపీ ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ పేరులోని అక్షరాలతో కాంగ్రెస్ మాజీ నాయకులు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్లు కలిసేలా ఫొటో పోస్టు చేశారు. ఇందులో గులాం నబీ ఆజాద్ పేరుతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత బిశ్వ శర్మ,  అనిల్ ఆంటోని పేర్లు ఉన్నాయి.

దీనిపైనే స్పందిస్తూ ఆజాద్ రాహుల్‍పై ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ అభిమానమే అని, అందుకే ఇంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటానికి మాత్రం రాహుల్‌ గాంధీనే ప్రధాన కారణమని ఆజాద్ మరోసారి తేల్చిచెప్పారు.

కాగా.. అదానీ పేరులోని అక్షరంతో తన పేరును చూపడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు.  అదానీతో సంబంధం లేని తనను ఈ వ్యవహారంలోకి లాగినందుకు రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్‌ పైలట్‌

మరిన్ని వార్తలు